ఒకే దేశంలో రెండు స్వాతంత్య్ర వేడుకలా..!

` ఒక దేశం.. ఒకే చట్టం.. ఒకే ఎన్నికలు..అంటున్న బిజెపికి రెండు స్వాతంత్య్రా వేడుకలు దేనికోసం?
` తెలంగాణలో విద్వేష రాజకీయాలు రెచ్చగొట్టేందుకే సెప్టెంబర్‌ 17 వేడుకలు..
` తెలంగాణజాతిని కలిపే సమైక్య దినోత్సవానికే జనం మొగ్గు..
` బీజేపీ వైఖరిపై తెలంగాణ ప్రజల సూటి ప్రశ్న..
` తెలంగాణ గడ్డ.. గంగా జమునా తహజీబ్‌కు అడ్డా..
హైదరాబాద్‌(జనంసాక్షి):భారతీయ జనతా పార్టీ తెలంగాణ విమోచన దినోత్సవం పేరు సెప్టెంబర్‌ 17న వేడుకలు నిర్వహించడం విస్మయం కలిగిస్తుంది. ఒకవైపు దేశంలో ఒకే దేశం ఒకే చట్టం కావాలంటు చెప్పుకొస్తున్న భారతీయ జనతా పార్టీ ఒకే దేశంలో రెండు స్వాతంత్రం వేడుకలు ఎందుకు చేయాల్సి వస్తుందో ఆ పార్టీ నేతలే చెప్పాల్సి ఉన్నది. భారత దేశంలో  విభిన్న పరిస్థితుల్లో కాశ్మీర్‌, జునాగడ్‌, తెలంగాణ సంస్థానాలు విలీనం అయిన విషయం తెలిసిందే. గుజరాత్‌ రాష్ట్రంలోని జూనాగడ్‌ సంస్థానం 1947 నవంబర్‌ 9న ప్రత్యేక పరిస్థితుల మధ్య భారతదేశంలో విలీనం అయింది. అక్కడ ఎలాంటి వేడుకలు నిర్వహించకుండా తెలంగాణ రాష్ట్రం భారత్‌ రిపబ్లిక్‌ లో విలీనమైన సెప్టెంబర్‌ 17న స్వాతంత్ర దినోత్సవంగా జరపాలంటూ పిలుపునివ్వడం తెలంగాణ ప్రజలను మిస్మయానికి గురిచేస్తుంది. జూనాగడ్‌ గుజరాత్‌ రాష్ట్రంలోని ఉండడం అక్కడ నుంచి దేశానికి నాయకత్వం వహిస్తున్న మోడీ , అమిత్‌ షా లు  రావడం గమనార్హం.  అక్కడ జరపకుండా తెలంగాణలో స్వాతంత్ర వేడుకలు జరపాలంటూ బిజెపి శ్రేణులను  ప్రోత్సహించడం వెనుక బిజెపి రాజకీయంగా విద్వేషాలను రెచ్చగొట్టే ‘కుట్ర’ కోణం ఉందని ప్రజలు సందేహం వ్యక్తం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్‌ 17 వేడుకలను నిర్వహిస్తూ రాజకీయంగా లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. విమోచన దినోత్సవం పేరుతో  తెలంగాణ ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టేందుకు వాడుకుంటుందన్న ఆరోపణలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీకి సెప్టెంబర్‌ 17 తో ఎలాంటి సంబంధం లేదని తెలంగాణ ప్రజలు నిర్వహించిన మహత్తర రైతాంగ పోరాటాల ద్వారానే విముక్తి అయిందని వామపక్షాలు ముందు నుంచి చెబుతూ వస్తున్నాయి.కేవలం రాజకీయ దురుద్దేశంతోనే సెప్టెంబర్‌ 17 వేడుకలను వాడుకోవాలని బిజెపి చూస్తోందన్న విమర్శలను లెఫ్ట్‌ పార్టీలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించి పరిష్కరించాల్సింది పోయి సెప్టెంబర్‌ 17 హిందూ ముస్లింల మధ్య గొడవగా చూపించి చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలు, తద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలనే కుట్ర కోణాన్ని భారతీయ జనతా పార్టీ అవలంబిస్తున్నట్లు రాజకీయ పరిశీలనలు కూడా చెబుతున్న మాట.ఒకే దేశం. ఓకే ప్రజలు ఒకే చట్టం కావాలంటూ పిలుపునిస్తున్న భారతీయ జనతా పార్టీ ఒకే దేశంలో రెండు స్వాతంత్ర వేడుకలు ఎందుకు జరుపుకోవాలని వస్తుందో అన్నది తెలంగాణ ప్రజలు అడుగుతున్న సూటి ప్రశ్న. తెలంగాణ రాష్ట్రంలో మతాల మధ్య ఎలాంటి విద్వేషాలు లేకుండా ప్రజలు కలిసిమెలిసి ఉంటున్న పరిస్థితుల్లో పనిగట్టుకుని తెలంగాణలో విమోచన దినం పేరుతో సెప్టెంబర్‌ 17 రాజకీయాలు చేస్తున్న బిజెపి నాయకులు ప్రజలకు అర్థం చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకే దేశం ఒకే చట్టం అంటూ చెప్పుకొస్తున్న బిజెపి సిద్ధాంతానికి విరుద్ధంగా తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్‌ 17 స్వాతంత్య్రా దినోత్సవాలకు సిద్ధం కావడం పై  ఆ పార్టీ నాయకులే గొంతు విప్పాలి.