ఒక్క దెబ్బకు రెండు గిన్నీస్ రికార్డులు
మన హైదరాబాదీ దీనాజ్ సొంతం
హైదరాబాద్, సెప్టెంబర్ 15 (జనంసాక్షి): ప్రముఖ ఫిట్‌నెస్ ట్రైనర్ దినాజ్ నేతృత్వంలో ఒకేరోజు రెండు గిన్నిస్ రికార్డులు మన రాష్ట్రానికి దక్కాయి. హైదరాబాద్ వేదికగా శనివారం నాడు దినాజ్ అరుదైన ఈ రికార్డులను సాధించి గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించి రాష్ట్రానికి
వన్నె తెచ్చారు. ఇప్పటికే మెక్సికో పేరిట ఉన్న జుంబర్ క్లాస్, బాలీవుడ్ క్లాస్ రికార్డులపై గురిపెట్టిన దినాజ్ బృందం ఈ రికార్డులను అవలీలగా అధిగమించారు. గతంలో మెక్సికోలో 3,876మంది ఒకేసారి జుంబా క్లాస్ నృత్యం చేశారు. ఈ రికార్డును 11వేల మందితో దినాజ్ బృందం హైదరాబాద ్‌లోని పీపుల్స్ ప్లాజాలో 30 నిమిషాలపాటు నిర్వహించి గత రికార్డును అధిగమించారు. ఫ్లోరిడాకు చెందిన జుంబా నృత్యాన్ని తిలకించేందుకు ఆ దేశానికి చెందిన ప్రతినిధులు ప్రత్యేకంగా రావడం విశేషం. బాలీవుడ్ క్లాసిక్ నృత్యాన్ని 4500మందితో గతంలో నిర్వహించిన రికార్డు ఉంది. ఇప్పుడీ రికార్డును సైతం 11వేలకు పైగా వచ్చిన నృత్యకారులతో 16 నిమిషాలపాటు నిర్వహించి బ్రేక్ చేసినట్లు దినాజ్ చెప్పారు. ఈ రికార్డు విన్యాసాన్ని గుర్తించేందుకు గిన్నిస్ ప్రతినిధులు వచ్చినట్లు ఆమె చెప్పారు. నృత్యం పట్ల ఆసిక్తి ఉన్న విద్యార్థులు, వైద్యులు, వ్యాపారవేత్తలతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రజలు ఈ రికార్డు నృత్యంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కూడా పాల్గొన్నారు.