ఒక అనుమానితుడు లొంగుబాటు: ఇద్దరు పరారీ
పారిస్: ప్రాన్స్ లో ఓ పత్రికా కార్యాలయంపై విధ్వంసం సృష్టించిన ఘటనకు సంబంధించి ఒక అనుమానితుడు లొంగిపోగా, మరో ఇద్దరు పరారయ్యారు. గతంలో పలు దాడులతో ప్రమేయమున్న చెర్రిఫ్ కౌచీ(34), అతని సోదరుడు సయ్యద్ కౌచీ(34)లతో పాటు మరో యువకుడికి పోలీసులు గురువారం అరెస్ట్ వారెంట్లు జారీ చేశారు. అయితే ఒకరు లొంగిపోగా.. మరో ఇద్దరు అనుమానితులు పరారయ్యారు. ఆ ఇద్దరు సోదరులు కాల్పులు జరిపిన అనంతరం కారులో పరారైనట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆ ఇద్దరు ఫోటోలను విడుదల చేసిన ఫ్రాన్స్ పోలీసులు వారి కోసం గాలింపు చర్యలను తీవ్ర చేశారు.
నగరంలో ‘చార్లీ హెబ్డో’ అనే వ్యంగ్య వారపత్రిక కార్యాలయంపై కొంతమంది ముష్కరుల దాడికి తెగబడిన సంగతి తెలిసిందే. ఓ కారును హైజాక్ చేసి కార్యాలయం వద్దకు దూసుకొచ్చిన ముష్కరులు ఏకే-47 తుపాకులతో విరుచుకుపడ్డారు. ఈ దాడిలో పత్రిక ఎడిటర్ ఇన్ చీఫ్, ముగ్గురు కార్టూనిస్టులు సహా మొత్తం 12 మంది ప్రాణాలు కోల్పోయారు.