ఒడిషాలో పాగా వేస్తాం: అమిత్‌ షా

భువనేశ్వర్‌,సెప్టెంబర్‌7(జ‌నంసాక్షి): ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన బీజేపీ తిరిగి అదే ఊపును ఒడిశాలో కొనసాగించాలనుకుంటోంది. గతంలో కొన్ని చిన్నపార్టీలతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్లిన బీజేపీ ఇప్పుడు ఏకంగా ఒంటరిగా వెళ్లి ఒడిశా పీఠాన్ని దక్కించుకోవాలని చూస్తోంది. ఇదే విషయాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా కూడా స్పష్టం చేశారు. ‘ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో మా పార్టీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోవడం లేదు. ఒంటరిగానే బరిలోకి దిగుతోంది. 2/3వంతు మెజార్టీ స్థానాలను కైవసం చేసుకొని అధికారంలోకి వస్తుంది’ అని ఆయన గురువారం విూడియా ప్రతినిధులతో చెప్పారు. ఒడిశాలో 2019లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తాము మొత్తం 147 స్థానాల్లో 120 స్థానాలు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేశారు. అయితే, ఈ ఎన్నికలను బీజేపీ తరుపున ఎవరు ముందుండి నడిపిస్తారనే విషయం త్వరలోనే నిర్ణయిస్తామని తెలిపారు. ‘కొంతమంది మాకు 120 సీట్లు రావడం సాధ్యం కాని పని అని అనుకుంటుండొచ్చు. కానీ, అక్కడ అధికారంలో ఉన్నవారిపై ప్రస్తుతం తీవ్ర వ్యతిరేకత ఉంది. బీజేపీ యువ నాయకత్వంతో ముందుకు వెళుతుంది. బీజేపీ అనుకూల పవనాలు దేశమంతా వీస్తున్నాయి. త్వరలోనే ఒడిశాకు వస్తాయి’ అని అమిత్‌ షా చెప్పారు.