ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ
– కెబినెట్‌లో పలు కీలకనిర్ణయాలు
– సీఎం కేసీఆర్
హైదరాబాద్,జనవరి 2(జనంసాక్షి): కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం రాత్రి 10.20 గంటలకు ముగిసింది. ఉదయం 11.30 గంటలకు సమావేశమైన మంత్రివర్గం పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించింది. సుమారు 11 గంటల పాటు మంత్రివర్గ సమావేశం కొనసాగింది.
తెలంగాణ మంత్రి వర్గ సమావేశ విశేషాలను ఆయన సచివాలయంలో విూడియాతో పంచుకున్నారు. బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చించడంతోపాటు వివిధ అంశాలపై నిర్ణయాలు తీసుకున్నామన్నారు.
నిర్ణయాలు
గత బడ్జెట్ కంటే అదనంగా 15శాతం నిధుల కేటాయింపు
ఒప్పంద ఉద్యోగులను రిజర్వేషన్ల వారీగా క్రమబద్దీకరణ
6,700 ఒప్పంద ఉద్యోగుల కనీస వేతనం రూ.12వేలకు పెంపు
సెలూన్లలో 200 యూనిట్ల కంటే తక్కువ బిల్లు వస్తే డొమెస్టిక్ ఛార్జీల వసూలు
కాలిబాట వ్యాపారులకు బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించేందుకు కృషి
ట్రాఫిక్ పోలీసులకు కాలుష్య భృతి
జీహెచ్‌ఎంసీలో గత 15ఏళ్లుగా నుంచి ఉన్న నీటిపన్ను మాఫీ.
15,628 ఉపాధ్యా పోస్టుల భర్తీ
నీటిపారుదల శాఖలో 108 పోస్టుల మంజూరు
మహబూబ్‌నగర్ వైద్య కళాశాలలో ఖాళీగా ఉన్న 462 పోస్టుల భర్తీ
గురుకుల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీ
రాచకొండ గుట్టల వద్ద 40 టీఎంసీల సామర్థ్యంతో జలాశయం నిర్మాణం
శావిూర్‌పేటలో 40 టీఎంసీల సామర్థ్యంతో మరో జలాశయం ఏర్పాటు.
మిషన్ కాకతీయ పనులు సకాలంలో పూర్తి చేస్తే 1.5శాతం ప్రోత్సాహకాలు
రాష్ట్రంలో ఉన్న 95శాతం ఆరోగ్య కేంద్రాల ఆధునీకరిస్తాం
హైదరాబాద్‌కు తాగునీటి కోసం రెండు జలాశయాలు
హైదరాబాద్‌కు తాగునీటి కోసం ప్రత్యేకంగా జలాశయాలు నిర్మిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. మంత్రివర్గ సమావేశం ముగిసిన అనంతరం సీఎం విూడియాతో మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ప్రత్యేకంగా రిజర్వాయర్లు లేవు. ఇప్పుడు 40 టీఎంసీల సామర్థ్యంతో నగరానికి రెండు తాగునీటిరిజర్వాయర్లు నిర్మిస్తాం. రామోజీ ఫిల్మ్ సిటీకి సవిూపంలోని రాచకొండ వద్ద ఒక రిజర్వాయర్, శావిూర్‌పేట వద్ద మరో రిజర్వాయర్ నిర్మిస్తామని స్పష్టం చేశారు. ఇక గత 15 ఏళ్ల నుంచి జీహెచ్‌ఎంసీ పరిధిలోని నీటి బకాయిలను మాఫీ చేస్తామని ప్రకటించారు.
హైదరాబాద్‌లో గులాబీ జెండా ఎగరటం ఖాయం: సీఎం
గ్రేటర్ ఎన్నికల్లో హైదరాబాద్‌లో గులాబీ జెండా ఎగరటం ఖాయమని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం సీఎం విూడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌లో నివసిస్తున్న ప్రజలందరినీ సమానంగా చూస్తున్నాం. కొందరు అభూతకల్పనలు సృష్టించారు. ఇక్కడున్న వారంతా హైదరాబాదీలే.. తెలంగాణ బిడ్డలే. అందరినీ రక్షించే బాధ్యత తమదేనని పేర్కొన్నారు. ఇక ఓటు ఎవరికీ వేయాలనేది ప్రజలకు విజ్ఞతకే వదిలేస్తున్నా. ఏది ఏమైనప్పటికీ హైదరాబాద్‌లో గులాబీ విజయం సాధిస్తుందన్నారు.
వారంలోగా కారుణ్య నియామకాలు
రాష్ట్రంలో కారుణ్య నియామకాల్లో ఆలస్యం జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం సీఎం విూడియాతో మాట్లాడారు. విధుల్లో ఉన్న ఉద్యోగి ఎవరైనా మరణిస్తే.. బాధిత కుటుంబంలో ఒకరికి వారంలోగా కారుణ్య నియామకం ఇవ్వాలని అధికారులు ఆదేశాలు జారీ చేశామన్నారు. కారుణ్య నియామకాల్లో అలసత్వం వహించడం తగదన్నారు.
15,628 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తాం : సీఎం
రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. మంత్రివర్గ సమావేశం ముగిసిన అనంతరం సీఎం విూడియాతో మాట్లాడుతూ.. డీఎస్సీ ద్వారా 15,628 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామన్నారు. డీఎస్సీ ప్రకటన త్వరలోనే వెలువడుతుందని చెప్పారు. గురుకుల పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను కూడా భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. నీటి పారుదల శాఖలో 108 పోస్టులు మంజూరు చేసినట్లు తెలిపారు. వరంగల్ ఎంజీఎంలో 147 పోస్టులు, మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజ్‌కి 462 పోస్టులు మంజూరు చేసినట్లు తెలిపారు.
జనవరిలోగా కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ
జనవరి నెల చివరిలోగా కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ పూర్తి చేయాలని నిర్ణయించామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం సీఎం విూడియాతో మాట్లాడారు. రిజర్వేషన్ల పద్ధతిలో కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ జరుగుతుందని ప్రకటించారు. రిజర్వేషన్ల విషయంలో తేడా ఉన్నా.. బ్యాక్‌లాగ్ ద్వారా భర్తీ చేస్తాం. ఇక ఒప్పంద ఉద్యోగులకు జీతాలు పెంచుతున్నాం. రూ. 6,700 జీతం ఉన్న వారికి రూ. 12 వేలకు పెంచాం. రూ. 8,400 జీతం ఉన్న వారికి రూ. 15 వేలకు పెంచాం. రూ. 10,900 ఉన్న ఉద్యోగులకు రూ. 17 వేలకు పెంచాం. పెంచిన జీతాలు జనవరి ,2016 నుంచి అమల్లోకి వస్తాయని సీఎం ప్రకటించారు.
బడ్జెట్ రూపకల్పనలో కొత్త పంథా
బడ్జెట్ రూపకల్పనలో కొత్త పంథాను అనుసరించబోతున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. మంత్రివర్గ సమావేశం ముగిసిన అనంతరం సీఎం కేసీఆర్ విూడియాతో మాట్లాడారు. బడ్జెట్‌కు సంబంధించి పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించాం. బడ్జెట్ రూపకల్పన ఇప్పటి వరకు మూసపద్ధతిలో కొనసాగేది. ఇప్పుడు ఆ గందరగోళం ఉండదు. అన్ని రంగాల్లో ఆదాయ పరంగా వృద్ధి బాగుంది. రాష్ట్రానికి రెండు రకాల ఆదాయం ఉంటుంది. గత బడ్జెట్ కంటే అదనంగా 15 శాతం కేటాయింపులు పెరిగే అవకాశం ఉంది. ట్యాక్స్ విషయంలో అన్ని రంగాల్లో 15 శాతం వృద్ధి కనిపిస్తుంది. పెరుగుతున్న ట్యాక్స్‌పైనే సుదీర్ఘ చర్చ జరిగింది. నిర్దేశించిన లక్ష్యాలను సాధించే విధంగా ముందుకు పోదామని సీఎం పేర్కొన్నారు.