ఒబామా నోబెల్‌పై ట్రంప్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

వాషింగ్టన్‌,సెప్టెంబర్‌24 జనం సాక్షి  : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శాంతి స్థాపన కోసం తాను ఎంతో కృషి చేశానని.. కానీ నోబెల్‌ కమిటీ తన కృషిని గుర్తించలేదని
ఆరోపించారు. 2009లో ఒబామాకు నోబెల్‌ శాంతి బహుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ట్రంప్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘అధ్యక్షుడు అయిన వెంటనే ఒబామాకు నోబెల్‌ శాంతి బహుమతి ఇచ్చారు. అసలు ఆ అవార్డు ఎందుకు ఇచ్చారో ఒబామాకు కూడా తెలియదు’ అంటూ ట్రంప్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2009లో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ఒబామాకు… అంతర్జాతీయ స్థాయిలో చూపించిన దౌత్యం, వివిధ దేశాల మధ్య నెలకొల్పిన సహకారం, ప్రజలతో కలిసి పనిచేసే మనస్తత్వం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని నోబెల్‌ శాంతి బహుమతి ఇచ్చారు. అప్పట్లో ఒబామాకు ఈ బహుమతి ఇవ్వడం పట్ల విమర్శలు కూడా తలెత్తాయి.
దాదాపు పదేళ్ల తర్వాత తాజాగా ట్రంప్‌ మరోసారి ఆ వివాదాన్ని తెరపైకి తెచ్చారు. ఐక్యరాజ్యసమితికి వెళ్లిన ట్రంప్‌ ఈ సందర్భంగా మాట్లాడుతూ… తనకు నోబెల్‌ ప్రైజ్‌ ఇవ్వకపోవడం సరికాదన్నారు. చాలా అంశాల్లో తాను చేసిన కృషికిగాను నోబెల్‌ ప్రైజ్‌ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. వివక్ష లేకుండా ఇచ్చివుంటే… తనకు ఎప్పుడో నోబెల్‌ వచ్చేదన్నారు. 2009లో ఒబామాకు ఇచ్చినప్పుడు… తనకెందుకు ఇవ్వరన్నది ట్రంప్‌ అభ్యంతరం.