ఒమిక్రాన్ తీవ్రమైనదా!!
మళ్లీ లాక్ డౌన్ విధించేనా?
ప్రజల్లో ఇదే ఆందోళన
న్యూఢల్లీి,డిసెంబర్3(జనంసాక్షి): మొన్నటి వరకు ప్రపంచ దేశాలను కరోనా వైరస్ మహమ్మారి వైరస్ వణికించింది. ఆ మహమ్మారి ప్రభావం కాస్త తగ్గుముఖం పట్టింది అనుకుంటున్న సమయంలోనే అకస్మాత్తుగా డెల్టా వైరస్ విజృంభించింది. కర్ణాటకలో శరవేగంగా డెల్టా వైరస్ విజృంభించడంతో ప్రపంచదేశాలు అల్లాడి పోయాయి ఇక ఆ భయం నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతున్న సమయంలో అకస్మాత్తుగా దక్షిణాఫ్రికా లో ఒమిక్రాన్ వైరస్ ప్రభావం పెరిగిపోయింది. ఆ దేశం నుంచి ప్రపంచ దేశాలకు ఈ వైరస్ మహమ్మారి తన ప్రతాపం చూపిస్తోంది. డెల్టా వేరియంట్ కంటే ఆరు రెట్ల వేగంతో ఈ ఒమిక్రాన్ వైరస్ విజృంభిస్తుండడంతో మరోసారి ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేగుతోంది. ఇప్పటికే ప్రపంచ దేశాలు ఈ వైరస్ విషయంలో అప్రమత్తమయ్యాయి. అంతర్జాతీయ ప్రయాణికులపై అనేక ఆంక్షలు విధించాయి. అలాగే కొన్ని దేశాలకు రాకపోకలు నిషేధించాయి. పౌరులు , ప్రవాసులు ఎవరు దేశం దాటి వెళ్లొద్దని సూచనలు చాలా దేశాలు చేశాయి. ఈ మహమ్మారి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉండడంతో అన్ని దేశాలు అప్రమత్తం అవుతున్నాయి. కొన్ని దేశాల్లో ఇప్పటికీ లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ లో లాక్ డౌన్ విధించే విషయంపై చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఈ ఒమిక్రాన్ వైరస్ భారత్ లోనూ అడుగు పెట్టింది. భారత్ లో 4 కేసులు నమోదు అయ్యాయి. కర్ణాటకలోని బెంగళూరు ఎయిర్ పోర్ట్ కు నవంబర్ 11న ఒకరు, నవంబర్ 20 న మరొకరు ఒమిక్రాన్ సోకిన దేశాల నుంచి వచ్చారు అయితే వారికి వైద్య పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ టాక్ రావడంతో వారిని ఐసోలేషన్ లో పెట్టారు. అలాగే మహారాష్ట్రలో నూ ఓ కేసు నమోదయింది. తెలంగాణకు వచ్చిన ఓ మహిళకు పాజిటివ్ గా తేలడంతో ఆమెకు ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నారు. ఇప్పుడు భారత్ లో ఈ వైరస్ మరింత విజృంభించే అవకాశం ఉన్న నేపథ్యంలో లాక్ డౌన్ విధింపు అంశం పై చర్చ జరుగుతోంది. గతంలో కరోనా వైరస్ సమయంలో విధించిన లాక్ డౌన్ కారణంగా భారత్ ఆర్థికంగా ఎంతో నష్టపోయింది. అన్ని వర్గాల ప్రజలు ఈ లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పటికే అనేక ఆంక్షలను భారత్ లో విధించారు. అయితే ఇప్పుడు ఈ కొత్త వేరియంట్ ను ఎదుర్కునేందుకు లాక్ డౌన్ ఒక్కటే మార్గమా లేక మరేదైనా ప్రత్యామ్నాయం ఆలోచిస్తారా అనేది తేలాల్సి ఉంది.