ఒలింపిక్స్ విజేతలకు సచిన్ సత్కారం
హైదరాబాద్,ఆగస్టు 28(జనంసాక్షి): రియో ఒలింపిక్స్‌లో సత్తా చాటిన పీవీ సింధు, సాక్షి మలిక్, దీపా కర్మాకర్‌ను మాజీ క్రికెటర్, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ ఘనంగా సత్కరించారు. పుల్లెల గోపీచంద్ అకాడవిూకి ఈ ఉదయం వచ్చిన సచిన్ సింధు, సాక్షి, దీపాతో పాటు గోపీచంద్‌కు బీఎండబ్ల్యూ కార్లను బహుకరించారు. అనంతరం వారితో సచిన్ సెల్ఫీ దిగారు. ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ.. సింధు, సాక్షి, దీపా.. దేశ ఆత్మగౌరవాన్ని నిలబెట్టారు. క్రీడల్లో దేశ విజయ ప్రస్థానం ఇప్పుడే ప్రారంభమైంది. క్రీడాకారులందరికీ మద్దుతుగా ఉంటాను. ఇలాంటి వేడుకలు మరెన్నో చేసుకోవాలి అని సచిన్ పేర్కొన్నారు.
గోపీ రియల్ హీరో
గోపీచంద్‌ను సచిన్ ప్రశంసలతో ముంచెత్తారు. విూరు మహత్తర స్ఫూర్తి. గోపీ విజయాలు చూసి గర్విస్తున్నాం. గోపీ నువ్వు రియల్ హీరో. విూరు దేశానికి మరిన్ని పతకాలు అందించాలి. గోపీతో పాటు మిగతా కోచ్‌లందరికీ ధన్యవాదాలు చెప్పారు. టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. క్రీడాకారులకు మద్దతుగా ఉన్న దేశ ప్రజలందరికీ సచిన్ కృతజ్ఞతలు తెలిపారు.
నా జీవిత ఆశయం నెరవేరింది : సింధు
ఒలింపిక్స్‌లో పతకం సాధించాలనే తన జీవిత ఆశయం నెరవేరిందని పీవీ సింధు తెలిపారు. తన కోచ్ గోపీచంద్‌కు రుణపడి ఉంటానన్నారు. భవిష్యత్‌లో జరిగే బ్యాడ్మింటన్ టోర్నమెంట్లలో గెలిచి భారత్‌కు మరింత పేరు తెస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ వేదికపై ఉండటం ఎంతో గౌరవంగా ఉందన్నారు సింధు. కారు బహుకరించిన సచిన్, చాముండీకి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. తనకు మద్దతుగా నిలిచి.. ఆశీర్వదించిన అందరికీ సింధు ధన్యవాదాలు చెప్పారు.
టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధిస్తా : సాక్షి
దేశ ప్రజలు తనపై కురిపిస్తున్న ప్రేమను చూస్తుంటే సంతోషంగా ఉందని సాక్షి మలిక్ పేర్కొన్నారు. తాను ఒలింపిక్స్ ఒంటరిగా వెళ్లానని తెలిపారు. దేశ ప్రజలంతా తనకు మద్దతిచ్చినందుకు వారికి ధన్యవాదాలు. టోక్యోలో స్వర్ణం సాధిస్తానని చెప్పారు. జేఎస్‌డబ్ల్యూ, రైల్వే, తన కుటుంబానికి రుణపడి ఉంటానన్నారు. తనను గౌరవించి కారు బహుకరించిన సచిన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
విూ ప్రేమకు ధన్యవాదాలు : దీపా
రియో ఒలింపిక్స్‌లో పతకం తేనప్పటికీ దేశ ప్రజలంతా గౌరవించడం సంతోషంగా ఉందని దీపా కర్మాకర్ తెలిపారు. వారి ప్రేమకు ధన్యవాదాలు చెప్పారు దీపా. కారు బహుకరించిన సచిన్ సార్‌కు కృతజ్ఞతలు చెప్పారు.




