ఓటరు చైతన్యం మరువలేనిది
అత్యధిక సర్పంచ్ స్థానాలు కట్టబెట్టడంపై హర్షం
మహిళల సంక్షేమానికి కెసిఆర్ పెద్దపీట: ఎమ్మెల్యే
ఆదిలాబాద్,జనవరి22(జనంసాక్షి): పంచాయితీ ఎన్నికల్లో అత్యధికచోటల్ టిఆర్ఎస్కు పట్టం కట్టినందుకు ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు. సిఎం కెసిఆర్ అబివృద్దికి ప్రజల తోడ్పాటు కావాలన్నారు. బంగారు తెలంగాణ రాష్ట్ర నిర్మాణమే తెరాస ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే అన్నారు.ప్రభుత్వం ఆసరా పింఛను, ఆహార భద్రత, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, ఇలా అనేక పథకాలను ప్రభుత్వం ప్రవేశ పెట్టి నిరుపేదలకు సహాయం అందిస్తుందన్నారు. అందుకే కేసీఆర్ నాయకత్వంలో తామంతా సైనికుల్లా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు. అందుకోసం స్థానిక ప్రజాప్రతినిధులు పనిచేస్తున్నారని అన్నారు. ఎందరికో సిఎం కెసిఆర్ భరోసా కల్పించారని మహిళలు జీవితాంతం సిఎం కెసిఆర్‌కు రుణపడి ఉంటారని అన్నారు. మహిళలను దృష్టిలో పెట్టుకొని టీఆర్ఎస్ ప్రభుత్వం ఏన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిందన్నారు. అందుకే మహిళా ఓటర్లలో చైతన్యం వెల్లివిరిసిందన్నారు. గర్భిణులకు ఆరోగ్యలక్ష్మితో పాటు అమ్మ ఒడి పథకం ద్వారా ప్రభుత్వ దవాఖానలో ప్రసవాలు జరుపుకొన్న మహిళలకు పాప పుడితే రూ. 13 వేలు, బాబు పుడితే రూ. 12 వేలతో పాటు రూ. 2వేల విలువ చేసే కేసీఆర్ కిట్‌ను అందజేస్తున్నామని తెలిపారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా పెళ్లి చేసుకొన్న తెల్ల రేషన్ కార్డు కలిగిన వారందరికీ రూ.75,116 అందిస్తూ కేసీఆర్ పెద్దన్న పాత్రను పోషిస్తున్నారన్నారు. రాష్ట్రంలోని కుల వృత్తులకు ఆర్థిక సహాయం అందించి ఆదుకుంటున్నారని చెప్పారు. రైతులను ఆదుకునేందుకు ఎకరానికి రూ.4 వేల చొప్పున ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు. ఒక్కో క్లస్టర్‌కు ఏఈవోలను నియమించి వారి పరిధిలో రైతు భవనాలను నిర్మిస్తామని, రైతులు భూసార పరీక్షలు చేయించుకొని దాని ఆధారంగా పంటలు వేసుకోవాలని సూచించారు. రానున్న రెండువిడతల్లో కూడా అత్యధిక స్థానాలు టిఆర్ఎస్కు కట్టబెట్టి మద్దతు తెలపాలన్నారు.