ఓటుకు నోటులో కేసులో దూకుడు పెంచిన ఏసీబీ
– పలువురు టీడీపీ నేతలకు నోటీసులు పంపిన ఏసీబీ
హైదరాబాద్ 19 జూలై (జనంసాక్షి) :
ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఎసిబి మరొకరికి నోటీసులు జారీ చేసింది. కేసు విచారణలో భాగంగా తెలుగుదేశం పార్టీ యువనేత ప్రదీప్ చౌదరికి 160 సీఆర్‌పీసీ కింద ఏసీబీ నోటీసులను ఇచ్చింది. సోమవారం ఉదయం 10.30 గంటలకు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌కు ప్రదీప్ ప్రధాన అనుచరుడు. ప్రదీప్ హైదరాబాద్ తెలుగు యువత విభాగానికి ఉపాధ్యక్షుడిగా విధులు నిర్వహిస్తున్నారు. యువనేత నారా లోకష్‌తో ప్రదీప్‌కు మంచి సంబంధాలు ఉన్నాయని సమాచారం. ప్రదీప్ అవిూర్ పేటలోని ఓ అపార్టుమెంటులో ఉంటున్నారు. కాగా, నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ప్రదీప్ రేపు ఉదయం విచారణకు హాజరు అవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ప్రదీప్ సహకారం ఏమైనా ఉందా అనే కోణంలో ఎసిబి అధికారులు విచారణ చేయనున్నారు. ఓటుకు నోటు కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని ప్రదీప్ తెలిపారు. ఎటువంటి సంబంధం లేకున్నప్పటికీ టిఆర్‌ఎస్ తన పైన కక్ష సాధించే చర్యల్లో భాగంగా నోటీసులు ఇచ్చిందన్నారు. తాను విచారణకు హాజరై సహకరిస్తానని చెప్పారు. తనకు న్యాయవ్యవస్థ పైన నమ్మకం ఉందన్నారు. తనకు సండ్ర వెంకట వీరయ్య, వేం నరేందర్ రెడ్డి వంటి వారితో పరిచయాలు లేవని, తాను అంత పెద్ద నేతను కూడా కాదని చెప్పారు. ఎసిబి విచారణకు హాజరై, ఆ తర్వాత వారు ఏం అడిగారన్న విషయం విూడియాకు చెబుతానన్నారు. కాగా, ఎసిబి ఇప్పటికే రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్ సిన్హా, సండ్ర వెంకట వీరయ్య, వేం నరేందర్ రెడ్డి, వేం తనయుడు కృష్ణ కీర్తన్ రెడ్డి తదితరులను విచారించింది. విచారణ కోసం వేం డ్రైవర్లకు నోటీసులు అందించింది. ఇప్పుడు ప్రదీప్‌కు ఇచ్చింది. జివ్మిూకి నోటీసులు ఇచ్చింది. అతను విచారణకు హాజరు కావాల్సి ఉంది.