ఓటుకు నోటు కేసులో కీలక మలుపు
– అవినీతి, క్రిమినల్ కేసు
– భన్వర్‌లాల్
– ఆడియో, వీడియో టేపుల కాపీని అడిగిన కేంద్ర ఎన్నికల కమీషన్
హైదరాబాద్,జూన్25(జనంసాక్షి): ఓటుకు నోటు కేసు కీలక మలుపు తిరుగుతోంది. ఓ వైపు ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేస్తుంటే.. మరోవైపు ఫోరెన్సిక్ ల్యాబ్ సమర్పించిన ఆడియో, వీడియో టేపుల కాపీతో పాటు వారు ఇచ్చిన రిపోర్ట్ కాపీ కూడా ఇవ్వాలని ఈసీ కోర్టులో మెమో దాఖలు చేసింది.ఓటుకు నోటు వ్యవహారం క్రిమినల్ కేసు, అవినీతి కేసని ఎన్నికల సంఘం సీఈఓ భన్వర్ లాల్ అన్నారు. దీనిపై ఏసీబీ సహా దర్యాప్తు సంస్థలు కేసు పెట్టొచ్చని ఆయన స్పష్టం చేశారు. ఇది ఎన్నికల సమయంలో జరిగింది కాబట్టి ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి కూడా వస్తుందన్నారు. ఈ కేసులో కోర్టు తీర్పు తర్వాత ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు. ఈ కేసుకు సంబంధించి ఏసీబీ ఇచ్చిన ఆధారాలన్నింటిని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించామని భన్వర్ లాల్ చెప్పారు. వీడియో, ఆడియో హార్డ్ డిస్క్, టేపుల కాపీ ఇవ్వాలని ఈ నెల 1న ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేశామని, ఇవాళ రిమైండర్ మెమో వేశామని ఆయన వివరించారు. ఆడియో, వీడియో టేపులకు సంబంధించిన ప్రాథమిక నివేదికను ఎఫ్‌ఎస్‌ఎల్ అధికారులు బుధవారం ఏసీబీ కోర్టుకు సమర్పించిన విషయం విదితమే. ఏసీబీ అధికారులు సైతం ఇందుకోసం కోర్టులో మెమో దాఖలు చేశారు. తమకూ ఎఫ్‌ఎస్‌ఎల్ పంపిన హార్డ్ డిస్క్, టేపుల కాపీని అందించాలని కోర్టును కోరారు. ఓటుకు నోటు కేసులో అవినీతి నిరోధకశాఖ అభ్యర్థనపై నిర్ణయం శుక్రవారానికి కి వాయిదా పడింది. ఎఫ్‌ఎస్‌ఎల్ ఇచ్చిన ఆడియో, వీడియో టేపులు ఇవ్వాలని ఎసిబి అభ్యర్థించింది. దీనిపై విచారించిన న్యాయస్థానం అభ్యర్థనపై నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఇదిలావుంటే ఓటుకు నోటు కేసు లో నిందితుడు మత్తయ్యకు సంబందించి నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీవెన్సన్ వేసిన నాట్ బిపోర్ పిటిషన్ పై హైకోర్టులో వాదోపవాదాలు జరిగాయి. ఈ కేసును విచారిస్తున్న న్యాయమూర్తి శివశంకరరావు ఈ కేసు విచారించరాదని స్టీవెన్సన్ తరపు న్యాయవాది వాదించారు. అయితే మత్తయ్య తరపు న్యాయవాది అభ్యంతరం చెప్పి పిటిషన్ లో లోపాలు ఉన్నాయని అన్నారు. దానిపై ఇద్దరి మద్య వాదోపవాదాలు జరిగాయి. జడ్జి ఇద్దరిని సంయమనంగా ఉండాలని కోరారు. కాగా జడ్జి లేకుండా కోర్టు ఉండదని, విూడియాలో దీనిపై వచ్చే కధనాలను పట్టించుకోనని,కోర్టు నిబంధనల ప్రకారమే పనిచేస్తుందని, విూడియా కధనాలు కోర్టును ప్రభావితం చేయజాలవని వ్యాఖ్యానించారు. కాగా ఓటుకు నోటు కేసులు దేశానికే సిగ్గుచేటుగా మారాయని స్టీవెన్సన్ న్యాయవాది అన్నారు. ఇలాంటివాటిని అందరు నిరోధించాలని సూచించారు. కాగా ఆడ్వకేట్ జనరల్ మాట్లాడుతూ ఈ పిటిషన్ స్టీవెన్సన్ వ్యక్తిగత ¬దాలో వేసుకున్నదని, దీనిపై కోర్టు ఎలాంటి తీర్పు ఇచ్చినా దానిపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం చెప్పదని అన్నారు.ఈ కేసు విచారణ సోమవారానికి వాయిదా పడింది. ఇదిలావుంటే ఓటుకు నోటు కేసులో నిందితుడు ఉదయ్‌సింహాను సరూర్‌నగర్ ఎక్సైజ్ పోలీసులు ఇవాళ కస్టడీకి తీసుకున్నారు. ఉదయసింహా ఇంట్లో విదేశీ మద్యం బాటిళ్లు దొరికిన కేసులో పోలీసులు అతనికి కస్టడీ విధించారు. ఉదయసింహాపై 34(ఏ) ఎక్సైజ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు రెండు రోజుల కస్టడీకి తీసుకున్నారు.