ఓటుకు నోటు కేసులో చట్టం తనపని తాను చేసుకుపోతుంది
– హైదరాబాద్‌లో శాంతి భద్రతలు భేష్
– స్మార్ట్ సిటీ సదస్సుకు రండి
– వెంకయ్యకు ఆహ్వానం
– హడ్కో చైర్మన్‌తో మంత్రి కేటీఆర్ భేటి
న్యూఢిల్లీ,జూన్18(జనంసాక్షి):ఓటు కు నోటు వ్యవహారంలో చట్టం తన పని తాను చేసుకుని పోతుందని ఆయన స్పష్టం చేశారు. టీటీడీపీ నేతలకు పనిలేక, ఏం చేయాలో పాలుపోక తమపై విమర్శలు చేస్తున్నారని, హైదారబాద్‌లో గతేడాదిగా శాంతిభద్రతలు భేషుగ్గా ఉన్నాయని తెలంగాణ పంచాయితీరాజ్, ఐటిశాఖ మంత్రి కెటి రామారావు అన్నారు. కొందరు రాజకీయలబ్ది కోసం చేసే విమర్శలను తాము పట్టించుకోబోమని అన్నారు.హైదరాబాద్‌లో శాంతిభద్రతలు చాలా బాగున్నాయని… అందరూ కలసి ఉన్నారని వెల్లడించారు. ఓటుకు నోటు వ్యవహారంలో జరిగిందేమిటో ప్రపంచానికంతా తెలుసునని మంత్రి కేటీఆర్ అన్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడుతో గురువారం న్యూఢిల్లీలో కేటీఆర్ సమావేశమయ్యారు. ఆగస్టులో స్మార్ట్ సిటీలపై హైదరాబాద్‌లో నిర్వహించే అంతర్జాతీయ సదస్సుకు వెంకయ్యనాయుడును ఆహ్వానించామని తెలిపారు. భేటీ అనంతరం కేటీఆర్ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ అవినీతి కేసులో చట్టం తనపని తాను చేసుకుంటూపోతోందన్నారు. అలాగే తమ ప్రభుత్వం ప్రారంభించిన డబల్ బెడ్ రూమ్ పథకానికి కేంద్ర సాయం అందించాలని వెంకయ్యను కోరామని చెప్పారు. తెలంగాణలో 12 క్లాస్‌వన్ సిటీలకు ప్రతిపాదనలు పంపామని… ఆ జాబితాలో సిద్ధిపేట కూడా చేర్చాలని వెంకయ్యనాయుడును ఈ సందర్భంగా కోరామని కేటీఆర్ తెలిపారు. టీడీపీ నేతలకు పనిలేకనే పొద్దుపోక మాపై విమర్శలు చేస్తున్నరని ఆయన మండిపడ్డారు. హైదరాబాద్‌లో ప్రశాంతత ఉందనడానికి తమ ఏడాది పాలనే నిదర్శనమని, సెక్షన్-8పై తెలుగుదేశం నేతల వ్యాఖ్యలు అర్థరహితమన్నారు. హైదరాబాద్‌లో ప్రజలు అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉన్నరు. గతంలో విమర్శలు చేసినవారికి ఇది చెంపపెట్టులాంటిది. వెంకయ్యనాయుడితో రహస్యంగా చర్చలు జరపలేదు. జరిగిందేమిటో ప్రపంచమంతటికీ తెలుసన్నారు. టీడీపీ నేతలకు పనిలేక, పొద్దుపోక మాపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. అభివృద్ధే లక్ష్యంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం ముందుకెళ్తుందని మంత్రి పేర్కొన్నారు. ఆయనవెంట ఢిల్లీలో ప్రభుత్వ అధికార ప్రతినిధి వేణుగోపాలాచారి తదితరులు ఉన్నారు.
ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కేటీఆర్ హడ్కో ఛైర్మన్ రవికాంత్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలను వివరించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న తాగునీటి పథకానికి రూ. 25 వేల కోట్లు మంజూరు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. గతంలోనే హడ్కో వాటర్ గ్రిడ్‌కు సహకారం అందిస్తామని తెలిపింది. ఈ ప్రాజెక్టు ప్రగతిని మంత్రి వివరించారు.