ఓటుకు నోటు కేసులో రేవంత్‌కు బెయిల్
హైదరాబాద్,జులై1(జనంసాక్షి):
చర్లపల్లి కారాగారం నుంచి టిడిపి నేత రేవంత్‌రెడ్డి విడుదలయ్యారు. కొంత ఆలస్యంగా సాయంత్రం ఆయన విడుదలయ్యారు. టిడిపి నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. రేవంత్ రెడ్డితోపాటు సెబాస్టియన్, ఉదయసింహాలు కూడా విడుదలయ్యారు. కారాగారం నుంచి రేవంత్‌రెడ్డి ఎన్టీఆర్ ఘాట్‌కు వెళ్లారు. ఓటుకు నోటు కేసులో చర్లపల్లి జైలులో ఉన్న రేవంత్ రెడ్డి బుధవారం సాయంత్రం విడుదలయ్యారు. ఉత్కంఠ పరిణామాల మధ్య ఏసీబీ కోర్టులో పూచీకత్తు సమర్పణ, అక్కడి నుంచి రిలీజ్ ఆర్డర్స్‌తో చర్లపల్లి జైలుకు చేరుకున్న రేవంత్ తరఫు న్యాయవాది, వాటిని జైలు అధికారులకు అందజేయడంతో సాయంత్రం 5.30 గంటల లోపే ఆయన విడుదలయ్యారు. ఆయనతో పాటుగా కేసులో భాగస్వాములైన ఉదయ సింహ, సెబాస్టియన్లను కూడా విడుదల చేశారు. ఓటుకు నోటు కేసులో దాదాపు నెల రోజులకు పాటు జైలు జీవితం గడిపిన రేవంత్ విడుదలతో ఆయన కుటుంబ సభ్యలతో పాటుగా టీడీపీ శ్రేణులు ఆనందోత్సాహాల్లో మునిగితేలారు. రేవంత్ విడుదల సందర్భంగా చర్లపల్లి జైలు వద్దకు పార్టీ నేతలు, కార్యకర్తలు, ఆయన అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే ఆయనకు పూల మాలలు వేసి ఘన స్వాగతం పలికారు. మహిళా కార్యకర్తలు హారతులు పట్టి, నుదిటిన తిలకం దిద్ది నీరాజనం పలికారు. అనంతరం ప్రత్యేకంగా వుంచిన వాహనంలో రేవంత్‌ను ఊరేగించారు. ఈ సందర్భంగా రేవంత్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు రేవంత్‌పై పూలవర్షం కురిపించారు. భారీ ఎత్తున బాణా సంచా కాల్చారు. ప్రభుత్వ కుట్రలను చీల్చుకుని పులి బోను నుంచి బయటకు వచ్చిందంటూ భారీ ఎత్తున నినాదాలు చేశారు.