ఓటుకు నోటు కేసులో సండ్రకు 14 రోజుల రిమాండ్‌

2

హైదరాబాద్‌,జులై7(జనంసాక్షి): ఓటుకు నోటు కేసులో సోమవారం అరెస్టయిన టిడిపి సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. ఏసీబీ నోటీసులతో  విచారణకు హాజరైన సండ్రను ప్రశ్నించిన ఏసీబీ అధికారులు అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించి మంగళవారం  న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. తాజాగా ఈ కేసులో సండ్రను ఏ5గా చేర్చారు. సండ్రకు జైలులో ప్రత్యేక వసతులు కల్పించాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి ఏసీబీ అధికారులు సోమవారం సండ్ర వెంకటవీరయ్యను విచారించి అనంతరం అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఏసీబీ అధికారులు ఆయన్ని కోర్టులో హాజరుపరిచి జ్యుడిషియల్‌ కస్టడీకి పంపాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. దీనిపై ఏసీబీ, సండ్ర తరపు న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు. అనంతరం సండ్రకు 14 రోజుల రిమాండ్‌ విధిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీచేశారు.అనంతరం సండ్రను చర్లపల్లి జైలుకు తరలించారు. అంతకు ముందు వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. వైద్య పరీక్షలు ముగిసిన అనంతరం ఏసీబీ కోర్టుకు తరలించారు. సండ్ర రిమాండ్‌ నివేదికను ఏసీబీ అధికారులు కోర్టుకు సమర్పించారు. రిమాండ్‌ నివేదికలో పలు కీలక విషయాలు బయటపడ్డాయి. సండ్రను తమకు ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ అధికారులు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. సండ్రను కస్టడీకి ఇవ్వాలన్న పిటిషన్‌పై విచారణ బుధవారానికి వాయిదా పడింది.  సండ్ర నిన్నటి విచారణలో ఏసీబీ ప్రశ్నలకు సమాధానాలు దాట వేశారని.. ఈ కేసులో మరింత సమాచారం సేకరించాల్సిన అవసరం ఉందని కోర్టును అధికారులు కోరారు. మరోవైపు సండ్రను ఐదు రోజుల కస్టడీకి అప్పగించాలని ఏసీబీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా, తనకు బెయిల్‌ మంజూరు చేయాలని సండ్ర న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ రెండు పిటిషన్లను స్వీకరించిన ఏసీబీ కోర్టు వీటిపై విచారణను రేపటికి వాయిదా వేసింది. ఓటుకు నోటు కేసులో సండ్ర అరెస్టు అక్రమమని ఆయన తరపు న్యాయవాది వాదించారు.దీనిపై ఇరుపక్షాల వాదన విన్న తర్వాత కొంత సమయం తీసుకుని ఎసిబి కోర్టు ఈ నిర్ణయం వెలువరించింది. ఒక వేళ కోర్టు సండ్ర అరెస్టు చెల్లదని ప్రకటించి ఉంటే తెలంగాణ ఎసిబికి ఇబ్బంది వచ్చేది. కాని కోర్టు రిమాండ్‌ విధించడంతో ఎసిబి ఊపిరి పీల్చుకున్నట్లయింది.

సండ్రకు ఉస్మానియాలో వైద్య పరీక్షలు

అంతకు ముందు ఓటుకు నోటు కేసులో నిన్న అరెస్టయిన ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు మంగళవారం ఉదయం ఉస్మానియా ఆసుపత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించారు. కోర్టులో హాజరుపర్చే ముందు ఇలా వైద్య పరీక్షలునిర్వహించడం ఆనవాయితీ. దీంతో ఆయనను ఆస్పత్రిలో చెక్‌ చేయించారు.  వైద్య పరీక్షల అనంతరం ఎమ్మెల్యే సండ్రను ఏసీబీ కోర్టులో హాజరుపర్చారు.  ఓటుకు నోటు కేసులో సండ్రను ఐదో నిందితుడిగా పేర్కొంటూ ఏసీబీ అధికారులు న్యాయస్థానంలో మెమో దాఖలు చేశారు. సోమవారం దాదాపు ఏడుగంటలపాటు విచారించిన తరవాత ఆయనను అరెస్ట్‌ చేశారు. విచారణకు హాజరు కాకుండా రాజమండ్రి ఆస్పత్రిలో చేరారని ఎసిబి తెలిపింది.సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఫోన్‌ నుంచి సెబాస్టియన్‌కు 22 సార్లు కాల్స్‌ వెళ్లాయని ఏసీబీ అధికారులు కోర్టుకు సమర్పించిన రిమాండ్‌ డైరీలో పేర్కొన్నారు. ఐదుగురు ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేందుకు సండ్ర ప్రయత్నించారని ఏసీబీ ఆరోపించించింది. సండ్రను ఏసీబీ కోర్టులో హాజరు పరచిన అధికారులు ఆయన్ను విచారించేందుకు వీలుగా ఐదురోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టును ఏసీబీ కోరింది. ఓటుకు నోటు కేసులో సండ్రను ఐదో నిందితుడిగా ఏసీబీ అధికారులు చేర్చారు.సండ్ర వెంకటవీరయ్యతో సంప్రదింపులు జరిపిన ఐదుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చేందుకు ఏసీబీ సమాయత్తం అయింది. సండ్ర వెంకటవీరయ్యతో మాట్లాడిన వారిలో టీఆర్‌ఎస్‌, వైసీపీలకు చెందిన ఎమ్మెల్యేలున్నారు.  కాగా తనను అక్రమంగా అరెస్టు చేశారని, తప్పుడు కేసు పెట్టారని,తాను న్యాయ పోరాటం చేస్తానని వెంకట వీరయ్య అన్నారు. ఓటుకు నోటు కేసులో ఐదో నిందితుడుగా ఎసిబి చేర్చింది. కాగా కొందరు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి వీరయ్య కూడ ప్రయత్నించారని ఎసిబి ఆరోపిస్తోంది. అయితే ఎసిబి అడిగిన అన్ని ప్రశ్నిలకు సమాధానం చెప్పానని అన్నారు. కాగా సండ్ర అరెస్టుకు నిరసనగా సత్తుపల్లితోపాటు వరంగల్‌ జిల్లా జనగామలోనూ టీడీపీ కార్యకర్తలు ధర్నా, రాస్తారోకోలు చేశారు. తెలంగాణలో టిడిపిని దెబ్బతీసేందుకు టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఓటుకు నోటు కేసులో అరెస్టయిన టి.టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు.  ఏసీబీ ప్రత్యేక కోర్టు 14 రోజుల పాటు రిమాండ్‌ విధించిన సందర్భంగా మాట్లాడుతూ ప్రజాక్షేత్రంలో టిఆర్‌ఎస్‌ను నిలదీస్తామని అన్నారు. 63 మంది ఎమ్మెల్యేలను గెలిచిన తెరాసకు ఇప్పుడు 82 మంది ఎలా వచ్చారని ప్రశ్నించారు. బెదిరింపులకు తాను భయపడేది లేదని.. ప్రభుత్వం చేసే కుట్రలను ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామన్నారు.  బహిరంగగంగా ఎమ్మెల్యేలను కొన్న టిఆర్‌ఎస్‌పై కేసులు పెట్టాలన్నారు. ప్రభుత్వం కుట్రతో వ్యవహరించిందని, లొంగడం లేదని కుట్ర చేసిందన్నారు. మొదట ఉన్న ఎమ్మెల్యే సంఖ్య ఇప్పుడు ఎమ్మెల్యేల సంఖ్య ఎలా పెరిగిందో ముందు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. శాసనసభలో ప్రభుత్వంపై ఉద్యమం చేస్తున్న వారిపై టి.సర్కార్‌ కుట్రలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఈ కేసులో చట్ట ప్రకారం ముందుకెళుతామని, వెనక్కి వెళ్లేది లేదని స్ఫష్టం చేశారు. ప్రజాక్షేత్రంలో పోరాటం కొనసాగిస్తామని సండ్ర వెంకట వీరయ్య పేర్కొన్నారు. తెరాస ప్రభుత్వం తమ పార్టీ ఎమ్మెల్యేలను కుట్రపూరితంగా అరెస్టు చేస్తోందని  సండ్ర వెంకటవీరయ్య ఆరోపించారు. సోమవారం ఉదయం పదిన్నర గంటల సమయంలో సండ్ర ఏసీబీ ఎదుట హాజరైన సంగతి తెలిసిందే. సుమారు ఏడు గంటల పాటు ఏసీబీ అధికారులు విచారించారు. విచారణలో పలు కీలక ప్రశ్నలకు సమాధానం ఇవ్వకపోవడంతో ఏసీబీ ఆయన్ను అరెస్టు చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఈ కేసులో రేవంత్‌ రెడ్డి..సెబాస్టియన్‌, ఉదయ్‌ సింహాలు అరెస్టయి బెయిల్‌ పై విడుదల సంగతి తెలిసిందే.