ఓటుకు నోటు కేసులో సండ్ర అరెస్టు

2

హైదరాబాద్‌,జులై6(జనంసాక్షి): ఓటుకు నోటు కేసులో మరో కీలక పరిణామంచోటుచేసుకుంది. తెలంగాణ టిడిపిఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను ఎసిబి అరెస్టు చేసింది. విచారణలో సరైన సమాధానాలు చెప్పకుండా సహకరించకపోవడంతో సండ్రను అరెస్టు చేసినట్లు సమాచారం. సోమవారం ఆయనను సుదీర్ఘంగా విచారించిన అనంతరం అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఆయన ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.ఉదయం నుంచి ఆయనను సుదీర్ఘంగా విచారించింది. ఓటుకు నోటు కేసులో తెలంగాణ టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను ఎసిబి అరెస్టు చేయడం ఈ కేసులో ఇది కీలక పరిణామంగా భావిస్తున్నారు.ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎసిబి విచారణ చేసిన తర్వాత వెంకట వీరయ్యను అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కేసులో నిందితుడు అయిన మత్తయ్యతో వీరయ్య మాట్లాడారని, అలాగే రేవంత్‌ తో ఎక్కువ సార్లు టచ్‌ లో ఉన్నారని కాల్‌ డేటా ఆధారంగా నిర్దారించారు. కిందటిసారి పది రోజుల గడువు అడిగిన వెంకట వీరయ్య సోమవారం నాడు విచారణకు హాజరయ్యారు. కాగా ఈ కేసులో మరో వ్యక్తి అయిన తెలుగుయువత నాయకుడు జిమ్మి మాత్రం విచారణకు హాజరు కాలేదు. అంతకుముందు మాజీ ఎమ్మెల్యే వేం నరేంద్రరెడ్డిని విచారించినా, అరెస్టు చేయలేదు. సండ్రను మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరిచే అవకాశం ఉంది. ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడు రేవంత్‌ రెడ్డి అరెస్టయినప్పటి నుంచి సండ్ర తప్పించుకు తిరుగుతున్నారు. విచారణకు హాజరు కాకపోతే అరెస్ట్‌ చేస్తామని వార్నింగ్‌ ఇవ్వడంతో చివరకు ఏసీబీ కార్యాలయానికి సండ్ర వచ్చారు. విచారణ అనంతరం ఆయనను ఏసీబీ అరెస్టు చేసింది. గత నెల 30, 31న రేవంత్‌రెడ్డితో సండ్ర పోన్‌లో మాట్లాడినట్లు ఏసీబీ ఐజీ తెలిపారు.  అలాగే ఈ కేసులో మరో నిందితుడు మత్తయ్యకు ఎనిమిది సార్లు ఫోన్‌లో మాట్లాడినట్లు ఏసీబీ గుర్తించింది. అనారోగ్యంతో ఇన్నాళ్లూ తప్పించుకు తిరిగిన సండ్ర వెంకట వీరయ్య చివరకు ఏసీబీ ఆఫీసుకు రాక తప్పలేదు. ఓటుకు నోటు కేసులో సండ్ర ఫోన్‌ సంభాషణల ఆధారంగా ఏసీబీ విచారణ సాగింది. ఏసీబీ అడిగిన ఒక్క ప్రశ్నకు కూడా సండ్ర సరైన సమాధానం ఇవ్వనట్లు తెలుస్తోంది. అందుకే ఆయనను కస్టడీకి తీసుకుని మరోసారి విచారించాలనే నిర్ణయంతో ఏసీబీ అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఓటుకు నోటు కేసులో ఇప్పటివరకు ఏసీబీ మొత్తం నలుగురిని అరెస్ట్‌ చేసింది. ఎమ్మెల్యే రేవంత్‌తో పాటు మరో ఇద్దరు ఇటీవలే బెయిలుపై విడుదలయ్యారు. మరిన్ని అరెస్ట్‌లు ఉన్నట్లు సమాచారం.