ఓట్లు అడిగే అర్హత టిఆర్‌ఎస్‌కు మాత్రమే ఉంది


గతపాలకులు సాగుతాగునీరు అందించడంలో విఫలం
నిర్మల్‌లో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న మంత్రి
నిర్మల్‌,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): ప్రజల కష్టాలను తీర్చుతూ వారికి జవాబుదారీగా పనిచేసిన టీఆర్‌ఎస్‌ పార్టీకే తిరిగి ఓట్లు అడిగే అర్హత ఉందని నిర్మల్‌ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. గత పాలకులు ప్రజలకు తాగు, సాగునీరు అందించాలనే సోయి కూడా లేదన్నారు. ప్రతీ ఇంటికి తాగునీరు, వ్యవసాయానికి సాగు నీరు అందించే లక్ష్యంతో మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ, సాగునీటి ప్రాజెక్ట్‌ ల నిర్మాణం చేపట్టామన్నారు. నిర్మల్‌ పట్టణంలో మంత్రి అల్లోల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మంగళవారం వెంకటాద్రిపేటలో గడప గడపకూ వెళ్లి వివిధ వర్గాల వారిని, వృద్దులను, మహిళలను పలకరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. ఎన్నికల ప్రచారానికి వచ్చిన అల్లోలకు మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు.ప్రజలను కలుస్తూ ఆయన  ప్రచారంలో దూసుకుపోతున్నారు. జనంతో మమేకమై వారి కష్టసుఖాలను తెలుసుకుంటూ.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అభివృద్ది, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత నాలుగేళ్లలో ఎన్నడూ గ్రామాల్లోకి రాని మహకూటమి నాయకుల కల్లబొల్లి మాటలను ప్రజలు నమ్మరని తెలిపారు. ఎన్నికల ముందు మాయమాటలు చెప్పి దగా చేయడానికి వస్తున్న నాయకులకు ప్రజలే ఓటుతో బుద్ది చెప్పాలని కోరారు. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నిర్మాణం పూర్‌ఖ్తెతే.. బీడు భూములు పచ్చని పంట పోలాలుగా మారుతాయని వెల్లడించారు. వృద్దులకు, విగకలాంగులకు ఫించన్లు ఇస్తూ ప్రభుత్వం వారికి అన్ని విధాలుగా అండగా ఉంటుందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి తనకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. నిర్మల్‌ జిల్లాను, నిర్మల్‌ నియోజకవర్గాన్ని అభివృద్ది చేస్తానని హామినిచ్చారు.