ఓట్లు దండుకోవడానికే రైతుబంధు పథకం: రమణ
కరీంగనర్,మే10(జనం సాక్షి): తెలంగాణ ప్రభుత్వం కేవలం ఆర్భాటాలకే పథకాలను ప్రవేశపెడుతుందని టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ ఆరోపించారు. పథకం ఏదైనా ఆర్భాటం వారి సొంతమబన్నారు. జిల్లాలో పర్యటించి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతులను మభ్యపెట్టడానికి పంట సహాయం పేరిట ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో ఓట్లు దండుకునేందుకు ఎత్తుగడ వేస్తోందని చెప్పారు. వడగండ్లు, కరువుతో నష్టపోయిన రైతు లను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ధాన్యం అమ్ముడు పోక, గిట్టుబాటు ధరలు లేక రైతులు ఆందోళన చెందుతుంటే ఎందుకు ఆదుకోవడం లేదన్నారు. ప్రభుత్వ అసమర్ధతతోనే నాలుగేళల్లో 400 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలిపారు. నాలుగేళ్లలో రూ5లక్షల కోట్ల బ్జడెట్‌ను ప్రవేశపెట్టినట్లు ప్రభుత్వం చెబుతుందన్నారు. అర్హులైన వారికి ఎంతమందికి ప్రభుత్వ ఫలాలు అందించారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పథకాలు కేవలం ధనికులు, పనులు చేయలేనివారికి, దోపిడీ దారులకు అందుతున్నాయే తప్ప అర్హులకు అందడంలేదని అన్నారు. విజయవాడమహానాడులో ప్రభుత్వ విధానాలపై చర్చించి ప్రజల కోసం పార్టీ ఆధ్వర్యంలో పోరాటం ఉధృతం చేస్తామమని అన్నారు.