ఓట్లు రాబట్టే పథకాలపై నిగ్గుదీయాల్సిందే

సొమ్మొకడిది సోకొకడిదిగా రాజకీయ పార్టీలు ఎడాపెడా చేస్తున్న వాగ్దానాలు చూస్తుంటే… ప్రభుత్వంలోకి వచ్చాక డబ్బులను వృధాగా ఖర్చు చేయడం మినహా అభివృద్ది కార్యక్రమాలకు ఖర్చు చేసే దాఖలాలు కనిపించడం లేదు. అధికారమే పరమావధిగా ఓట్లు రాబట్టుకునే క్రమంలో రాజకీయ పార్టీలు బడ్జెట్‌కు మించి వాగ్దానాలు చేస్తున్నాయి. అభివృద్ది అన్న పదాన్ని పక్కన పెట్టి డబ్బులు పంచడమే ప్రభుత్వ విధి అన్న రీతిలో పథకాలను ప్రకటిస్తున్నారు. విద్యావైద్య రంగాలను ఏ విధంగా అభివృద్ది చేస్తాయో చెప్పడం లేదు. రోడ్ల విస్తరణ, నిరుద్యోగ సమస్య తీర్చడం వంటి సమస్యలపై ప్రణాళిక లేదు. వ్యవసాయాభివృద్దికి ఎలాంటి చర్యలు తసీఉకోవాలో తేల్చడం లేదు. ఎన్నికల ప్రణాళికలు ప్రకటిస్తున్న రాజకయీ పార్టీల్లో రాష్ట్రాల అభివృద్దిలో విజన్‌ అన్నది లేకుండా పోయింది. పన్నుల రూపంలో ముక్కుపిండి వసూలు చేస్తున్న డబ్బులను ఎవడబ్బ సొమ్మని ఖర్చు పెడతారో ప్రజలు నిలదీయాల్సి ఉంది. రైతులకు పెట్టుబడి సాయం పేరుతో తెలంగాణలో 12వేల కోట్లను రైతులకు అందచేసిన డబ్బులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయన్నది ప్రజలు ఆలోచించాలి. ఇలా పందేరాలు చేస్తూ పోతుంటే ఏ రాష్ట్రం కూడా పురోగమించదు. ఉచిత పథకాలకు దుబారా చేస్తే రోడ్లు, ప్రాజెక్టులు, విద్యుత్‌ ఎలా వస్తుందన్నది ఆలోచన చేయడం లేదు. ఎప్పుడో ఎన్టీఆర్‌ తొలినాళ్లలో ప్రవేశ పెట్టిన కిలో రెండు రూపాయల బియ్యం పథకం ఇంకా కొనసాగించడం, దానిని కిలో రూపాయికే అందించడం ఎంతవరకు సబబో ఆలోచన చేయాలి. రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రణాళికల పేరిట విచ్చలవిడిగా వాగ్దానాలు చేస్తున్న తీరు చూస్తుంటే ఇక రాష్ట్రంలో కనీసం ఒక్క రోడ్డయినా బాగు చేయగలరా అన్న భయం కలుగుతోంది. రాజకీయ నాయకుల వాగ్దానాలకు పరిమితి లేకుండా పోతోంది. ప్రజా సంక్షేమం పేరిట అమలు చేస్తున్న పథకాలు ఇప్పటికే ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అదే దశలో ప్రజలను నిర్వీర్యం చేస్తున్నారు. ఇబ్బడిముబ్బడిగా మద్యం విక్రయాలను ప్రోత్సహిస్తూ ప్రజలను మత్తులో ముంచి వచ్చిన డబ్బుతో వృధా ఖర్చులు చేస్తున్నారు. ప్రజలను మద్యానికి బానిసలుగా మారుస్తూ, దాని ద్వారా వచ్చే ఆదాయంతో సంక్షేమ పథకాలంటూ విచ్చలవిడిగా ఖర్చు చేయడం బాధ్యతారాహిత్యం కాక మరోటి కాదు. ప్రజల ప్రాథమిక హక్కులైన విద్య, వైద్య రంగాలను పటిష్టం చేసే కార్యాచరణ ఇప్పటి వరకు జరిగిన దాఖలాలు లేవు. దుబారా ఖర్చులతో జల్సా చేస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా హెలికాప్టర్లు, సొంతంగా విమానాలు ఉపయోగిస్తున్నారు. ఎన్నికల్లో ఓట్లు పొంది అధికారమే పరమావధిగా అడిగిందే తడవుగా వరాలు కురిపిస్తున్నారు. కాంగ్రెస్‌,టిడిపి, టిఆర్‌ఎస్‌ పార్టీలు పోటీపడి వరాలు ప్రకటించా యి. డబ్బుల ఎక్కడి నుంచి వస్తాయన్న లెక్కలేకుండా మాట్లాడుతున్నారు. అధికార టిఆర్‌ఎస్‌, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ పార్టీ నిరుద్యోగ భృతితో పాటురైతులకు రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్‌ రెండు లక్షలంటే, టిఆర్‌ఎస్‌ లక్ష మాఫీ చేస్తామని ప్రకటించారు. అలాగే నిరుద్యోగ భృతి కింద 3వేలు ప్రకటించారు. రైతుబంధును ఎకరాకు పదివేలు ఇస్తామని కెసిఆర్‌ ప్రకటించారు. రైతుబంధు, పింఛను మొత్తాలను పెంచడం వంటివి ఏ అభివృద్ది పథకాలో చెప్పాలి. పెన్షన్లు ఇవ్వడం, రుణాలు మాఫీ చేయడం,రైతుబంధు పథకాలు అమలు చేయడమే అభివృద్ది అయితే దానికి ఎన్నకున్న ప్రభుత్వాలు అవసరం లేదు. నేరుగా బ్యాంకులకు చెబితే ఖజానా నుంచి వాటంతట అవే అమలయి పోతాయి. ఎపిలో /హఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా గత ఎన్నికలలో ఎడాపెడా హావిూలు ఇచ్చారు. వాటి అమలుకు ఇప్పుడు ఆపసోపాలు పడుతున్నారు. యువనేస్తం పేరిట ఒక్కొక్కరికి నెలకు వెయ్యి రూపాయలను నిరుద్యోగ భృతి కింద చెల్లించడం మొదలుపెట్టారు.చేస్తున్న ప్రతిపక్ష నాయకుడు

జగన్మోహన్‌రెడ్డి కూడా హద్దూ?అదుపూ లేకుండా హావిూలు ఇచ్చుకుంటూ పోతున్నారు. ఆయన ఇస్తున్న హావిూల అమలుకు లక్షల కోట్ల రూపాయలు కావలసి ఉంటుంది. ప్రజలు పన్నుల రూపంలో కడుతున్న డబ్బుకు ప్రభుత్వాలు జవాబుదారీగా ఉండాలి. కానీ పథకాలు అమలు చేస్తూ ఓట్లు కొల్లగొట్టేలా కార్యాచరణ చేస్తున్నారు తప్ప రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకుని వెళ్లాలన్న ఆలోచన చేయడం లేదు. లక్షల కోట్లు అప్పు చేసి పెడుతున్నారు. ప్రజాధనాన్ని పందేరం చేయడానికి అన్ని పార్టీలూ పోటీపడుతున్నాయి. రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చేది కేవలం అధికారం అనుభవించడం… ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బులను పంచడం అన్న రెండు పథకాలకే పరిమితం అయ్యేలా చేస్తున్నారుయి. ఇతరత్రా అభివృద్ధి కార్యక్రమాల అమలుకు అప్పులు చేస్తూ ప్రజలపై రుణభారాన్ని మోపుతున్నారు. ఇలా ఎన్నేళ్లయినా తీర్చలేని విధంగా అప్పుల ఊబిలో ముంచి పోతున్నారు. సమాజంలోని అట్టడుగువర్గాల వారినీ, నిరుపేదలను ఆదుకోవలసిన పద్దతి ఇదేనా అన్నది సమాజాం ఆలోచన చేయాలి. వీరిని గట్టెక్కించ డానికి ఉపాధి మార్గాలు పెంచడం, ఆదాయ వనరులు పెంచగలిగే కార్యక్రమాలు వంటివి చేయాలి. బాధ్యత గల ప్రభుత్వాలు ఇలాగే ఆలోచన చేయాలి. కానీ సంక్షేమం పేరుతో ప్రజలను సోమరిపోతులుగా చేసే పథకాలు ప్రకటించడం ద్వారా మనం ఏం సందేశం ఇవ్వదల్చుకున్నామో చెప్పడం లేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని అన్ని రాజకీయ పార్టీల నాయకులూ అంగీకరిస్తున్నారు. అయినా లెక్కకు మిక్కిలి హావిూలు గుప్పిస్తున్నారు. రైతులకు రుణమాఫీ వంటి హావిూలు ఇవ్వడంకన్నా వారు పండించిన పంటలకు గిట్టుబాటు ధరల కల్పించి కొనుగోలు చేయాలన్న ఆలోచన ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ చేయలేదు. వ్యవసాయాన్ని ఎలా బాగు చేయాలన్న ఆలోచన లేదు. విద్యారంగాన్ని ఎలా బాగు చేయాలన్న ధ్యాసలేదు. వైద్యరంగాన్ని ఎలా బలోపేతం చేద్దామన్న భరోసా లేదు. ఇలాంటి పార్టీలు ఇస్తున్న వాగ్దానాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండకపోతే మనలను అప్పుల ఊబిలోకి నెట్టి వారు అధికారన్ని అనుభవించగలరని గమనించాలి.