ఓట్ల గల్లంతు విషయంలో..  ప్రతిపక్షాలవి కావాలనే  దుష్పచ్రారం


– మహాకూటమి దుష్ట చతుష్టయం
– నాలుగున్నరేళ్లలో అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలిచాం
– మరోసారి ఆశీర్వదిస్తే ప్రతి సమస్యను పరిష్కరిస్తాం
– నిజామాబాద్‌ ఎంపీ కవిత
నిజామాబాద్‌, సెప్టెంబర్‌19(జ‌నంసాక్షి) : ఓట్ల గల్లంతు విషయంలో ప్రతిపక్షాలు కావాలనే టీఆర్‌ఎస్‌పై దుష్పచ్రారం చేస్తున్నాయని నిజామాబాద్‌ టీఆర్‌ఎస్‌ ఎంపీ కవిత అన్నారు. బుధవారం నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మండలంలోని చేపూర్‌ గ్రామంలో డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహాన్ని ఎంపీ కవిత ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం గ్రామస్తులు ఏర్పాటు చేసిన సభలో ఎంపీ, ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడారు. ఓట్ల గల్లంతు విషయంలో కాంగ్రెస్‌ కావాలనే టీఆర్‌ఎస్‌పై దుష్పచ్రారం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్ల వ్యవహారం ఎలక్షన్‌ కమిషన్‌ పరిధిలోకి వస్తుందన్న విషయాన్ని కాంగ్రెస్‌ పార్టీ గమనించాలని ఆమె సూచించారు. మహాకూటమి దుష్ట చతుష్టయం అని కవిత పేర్కొన్నారు. తెలంగాణ విూద ప్రేమ లేని పార్టీలు
మహాకూటమిగా వస్తున్నాయన్నారు. 60 ఏళ్లుగా లేని అభివృద్ధిని సీఎం కేసీఆర్‌ నాలుగేళ్లలో చేసి చూపించారని, పెండింగ్‌లో ఉన్న రైల్వే పనులు, అండర్‌ గ్రౌండ్‌ పనులు పూర్తయ్యాయన్నారు. అభివృద్ధిని ప్రజలు గమనిస్తున్నారని టీఆర్‌ఎస్‌ వైపు ప్రజలు మొగ్గుచూపుతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రజలను ఇప్పటికే టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీలు పీక్కుతిన్నాయని కవిత నిప్పులు చెరిగారు. నాలుగున్నారేళ్లలో ప్రభుత్వం అన్ని వర్గాల వారికి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి ఆదుకుందని తెలిపారు. రాబోయే ఎన్నికలలో కూడా తమ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ఓటు వేసి గెలిపిస్తే.. ఇంకా ఎన్నో మంచి మంచి పథకాలు ద్వారా ప్రజల్లోకి వెళ్లి అందరి అభివృద్ధికి పాటు పడతామని అన్నారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపించిన జీవన్‌ రెడ్డిని రాబోయే ఎన్నికలలో గెలిపించాలని ఆమె ప్రజలను కోరారు. గ్రామస్తులు అడిగిన విధంగా వారి గ్రామంలో ఉన్న మౌలిక వసతులు త్వరలోనే పూర్తి చేస్తామని ఎంపీ కవిత ప్రజలకు హావిూ ఇచ్చారు.