ఓడిపోవటం చాలా బాధించింది
– ఆశించిన స్థాయిలో బ్యాటింగ్ చేయలేక పోయాం
– రాజస్థాన్ రాయల్స్ కెప్టన్ రహానే
కోల్‌కతా, మే24(జనం సాక్షి) : ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో తమ జట్టు ఓటమి పాలు కావడం తీవ్ర నిరాశకు గురిచేందని రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ అజింక్యా రహానే ఆవేదన వ్యక్తం చేశాడు. తమ ముందు ఉన్న లక్ష్యం పెద్దది కాకపోయినప్పటికీ, దాన్ని ఛేదించడంలో విఫలం కావడానికి కోల్‌కతా బౌలర్లు మెరుగ్గా బౌలింగ్ చేయడమే కారణమన్నాడు. మ్యాచ్ అనంతరంత రహానే మాట్లాడుతూ..’ ఆదిలోనే కోల్‌కతా కీలక ఆటగాళ్లను ఔట్ చేసి పైచేయి సాధించాం. అయితే కార్తీక్-శుభ్‌మాన్ గిల్‌లు చక్కటి భాగస్వామ్యాన్ని నమోదు చేసి కోల్‌కతాను తేరుకునేలా చేశారు. మరొకవైపు రస్సెల్ ఇచ్చిన క్యాచ్‌ను వదిలేయడం కూడా మా విజయావకాశాలపై బాగా ప్రభావం చూపింది. కోల్‌కతా పరిస్థితుల్ని అర్థం చేసుకుని రాణించిన తీరు అమోఘం. మా ముందు సాధారణ లక్ష్యం ఉన్నా దాన్ని ఛేజ్ చేయలేకపోయాం. ఇది చాలా బాధించింది. నేను, సంజూ శాంసన్ ఆడుతున్నంతసేపు మ్యాచ్ సానుకూలంగానే సాగింది. మేమిద్దరం స్పల్ప వ్యవధిలో ఔట్ కావడం మా ఓటమికి ఒక కారణం. ఓవరాల్‌గా ఒక మంచి క్రికెట్ ఆడాం. ఈ సీజన్‌లో మా బౌలింగ్ యూనిట్ లెక్కకు మించి శ్రమించింది. బ్యాటింగ్, ఫీల్డింగ్‌లో మాత్రం మెరుగుపడాల్సిన అవసరం ఉంది’ అని రహనే తెలిపాడు. ఎలిమినేటర్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఆపై రాజస్తాన్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 144 పరుగులకే పరిమితమయ్యారు. దాంతో కోల్‌కతా 25 పరుగుల తేడాతో గెలిచి క్వాలిఫయర్-2కు అర్హత సాధించింది. శుక్రవారం సన్‌రైజర్స్ హైదరాబాద్-కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్ల మధ్య క్వాలిఫయర్-2 మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది.