ఓడీఎఫ్‌లో తెలంగాణ నం.1

` అభినందించిన కేంద్రం
హైదరాబాద్‌,డిసెంబరు 24(జనంసాక్షి):దేశంలో అన్ని రంగాల్లో మొదటి స్థానంలో నిలుస్తున్న తెలంగాణ మరోసారి స్వచ్ఛ భారత్‌ మిషన్‌ ప్రకటించిన బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత (ఓడీఎఫ్‌` ఓపెన్‌ డెఫకేషన్‌ ఫ్రీ) సమాజ నిర్మాణంలో దేశంలోనే నంబర్‌ వన్‌గా నిలిచింది. ఇందుకు సంబంధించిన వివరాలను కేంద్ర స్వచ్ఛ భారత్‌ మిషన్‌ విడుదల చేసినట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు తెలిపారు.స్వచ్ఛ భారత్‌ మిషన్‌ విడుదల చేసిన వివరాల ప్రకారం.. దేశంలో ఇప్పటివరకు స్వచ్ఛ గ్రామాల్లో మూడిరట ఒకటో వంతు గ్రామాల్లో తెలంగాణ రాష్ట్రమే ఓడీఎఫను పూర్తి చేసిందన్నారు. అలాగే దేశంలో 17, 684 ఓడీఎఫ్‌ గ్రామాలుండగా ఇందులో 6,537 గ్రామాలు తెలంగాణవే ఉన్నాయి. తెలంగాణ మొదటి స్థానంలో ఉండగా.. తమిళనాడు, కర్ణాటక, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలు 2, 3, 4 స్థానాల్లో ఉన్నాయి. ఇదిలా ఉండగా రాష్ట్రంలోని గ్రామాలు అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి దయాకర్‌ రావు అన్నారు.సీఎం కేసీఆర్‌ చేపట్టిన పల్లె ప్రగతి వంటి పథకాల వల్లతోనే మన పల్లెలు ఆదర్శంగా మారాయని అన్నారు. పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్‌ యార్డులు, స్మశాన వాటికలు ఇలా అనేక అభివృద్ధి పనులు చేపడుతూనే… నిరంతరం పారిశుధ్య పనులు చేయడంతోనే ఇలాంటి అభినందనలు వస్తున్నాయన్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛ రాష్ట్ర, భారత నిర్మాణంలో భాగస్వాములైన అధికారులు, సిబ్బంది, ప్రజలకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు.

 

తాజావార్తలు