ఓయూలో నిరసన జ్వాలలు
– రోహిత్‌కు మద్ధతుగా ఆందోళనలు
– అరెస్టు చేసిన పోలీసులు
హైదరాబాద్,జనవరి27(జనంసాక్షి): ఉద్యమాల పురిటి గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ మరోసారి ఉద్రిక్తంగా మారింది. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆత్మహత్యకు పాల్పడిన రోహిత్ కు మద్దతుగా విద్యార్తులుర్యాలీగా బయలు దేరడంతో పోలీసులు యధావిధిగా అడ్డుకున్నారు. రోహిత్ కుటుంబానికి న్యాయం జరగాలి, కేంద్రమంత్రి దత్తాత్రేయ, స్మృతి ఇరానీ, హెచ్ సీయూ వీసీ అప్పారావును తొలగించాలనే నినాదాలతో ఓయూ విద్యార్థులు ముందుకు కదిలారు. దీంతో ఉస్మానియా విశ్వవిద్యాలయం పాలక భవనం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వారిని ముందుకు కదలనీయకుండా పోలీసులు విద్యార్థులను అడ్డుకున్నారు. భారీ సంఖ్యలో విద్యార్థులు అక్కడికి తరలి రావడంతో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో విద్యార్థులకు పోలీసుల మధ్య తోపులాట కూడా చోటుచేసుకుంది. కొంతమంది విద్యార్థులను పోలీసులు ఈడ్చుకెళ్లి అరెస్టు చేశారు. హెచ్ సీయూలో రోహిత్ ఆత్మహత్యకు పాల్పడిన నేపథ్యంలో హెచ్సీయూ జాక్ దేశ వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ పిలుపునందుకునే ఉస్మానియా విద్యార్థులు మరోసారి కదం తొక్కారు. దీంతో విద్యార్ధుల ఆందోళనలు రోజురోజుకు ఉధృతమవుతున్నాయి. రోహిత్ ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఇవాళ దేశవ్యాప్తంగా వర్సిటీల బంద్‌కు హెచ్‌సీయూ జేఏసీ పిలుపునిచ్చింది. దీంతో ర్యాలీలు, ఆందోళనలు చేసేందుకు విద్యార్ధులు సిద్ధమయ్యారు. మరోవైపు తన కుమారుడు ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని రోహిత్ తల్లి త్వరలోనే రాష్ట్రపతిని కలవబోతున్నారు. మరోవైపు విద్యార్ధుల ఆందోళనలతో సెంట్రల్ యూనివర్సిటీ అట్టుడుకుతోంది. రోహిత్ ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకునే వరకు ఉద్యమం కొనసాగించాలని స్టూడెంట్స్ డిసైడయ్యారు. వర్సిటీ ప్రాంగణంలో పోలీసులు దీక్షలను భగ్నం చేసి ఆస్పత్రికి తరలించినా… విద్యార్ధులు మళ్లీ మళ్లీ దీక్షలు చేస్తూనే ఉన్నారు. మరోవైపు రోహిత్ ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా యూనివర్సిటీల బంద్‌కు హెచ్‌సీయూ జేఏసీ పిలుపునిచ్చింది. దీంతో ఓయూలో కూడా విద్యార్థులు ఆందోళనకు దిగారు. విద్యార్ధుల ఆందోళనలకు దేశంలోని ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాలతో పాటు అనేకమంది మద్దతు తెలిపాయి. స్వచ్ఛందంగా వర్సిటీకి తరలివచ్చి విద్యార్ధులకు సంఘీభావం తెలుపుతున్నారు. రోహిత్ కుటుంబానికి న్యాయం జరిగేవరకు అండగా ఉంటామంటూ భరోసా ఇస్తున్నారు. ఇక హెచ్‌సీయూ వీసీ అప్పారావును సెలవుపై పంపించడం.. ఆయన స్థానంలో ఇన్‌చార్జ్ వీసీగా శ్రీవాస్తవ్‌ను నియమించడాన్ని విద్యార్ధులు తప్పుపడుతున్నారు. అప్పారావును రక్షించేందుకు సెలవుపై పంపించారని ఆరోపిస్తున్నారు. దేశవ్యాప్తంగా వర్సిటీల బంద్‌కు పిలుపునిచ్చిన హెచ్‌సీయూ జేఏసీ, రేపు, ఎల్లుండి కూడా నిరసనలు, ధర్నాలు, ర్యాలీలు చేయాలని నిర్ణయించారు. రోహిత్ పుట్టిన రోజైన జనవరి 30న హెచ్‌సీయూలో రాష్ట్ర సదస్సు నిర్వహించబోతున్నారు. న్యాయం కోసం, తన కుమారుడు ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి ప్రణబ్‌ను కలిసేందుకు రోహిత్ తల్లి రాధిక సిద్ధమవుతున్నారు . రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ ఖరారు కాగానే ఆమె ఢిల్లీ వెళ్లి పరిస్థితులను వివరించనున్నారు. కాగా హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకు నిరసనగా భారతదేశ వ్యాప్తంగా యూనివర్శిటీలలో బంద్ జరిగింది. ఇందులో భాగంగా హైదరాబాద్ లో యూనివర్శిటీ విద్యార్దులు బంద్ నిర్వహించి ఆందోళన చేశారు.సెంట్రల్ యూనివర్శిటీ వైస్ చాన్సలర్ అప్పారావును సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఎబివిపి విద్యార్దులు బంద్ ను విపలం చేయడానికి యత్నించారని,వారిని అడ్డుకున్నామని వారు చెప్పారు. శ్రీ వాస్తవ ను వైస్ చాన్సలర్ గా నియమించడం కూడా సరికాదని అన్నారు. అప్పారావును అరెస్టు చేసి జైలుకు పంపాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. వచ్చే నెల మూడు ,నాలుగు తేదీలలో చలో డిల్లీ నిర్వహిస్తామనిప్రకటించారు. మరోవైపు కొందరు విద్యార్ధులు ఆమరణ దీక్ష కొనసాగిస్తున్నారు. జెఎసి పిలుపు మేరకు ఉస్మానియా యూనివర్శిటీలో కూడా బంద్ సందర్భంగా ఉద్రిక్తత ఏర్పడింది. రోహిత్ ఆత్మహత్య కేసులో న్యాయం జరగాలన్నది తమ డిమాండ్ అని వారు చెప్పారు. రోహిత్ కు మద్దతుగా గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విద్యార్థులు బుధవారం బంద్ పాటిస్తున్నారు. రోహిత్ ఆత్మహత్య ఘటనకు నిరసనగా విద్యార్థి జేఏసీ బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు నాగార్జున విశ్వవిద్యాలయంలోనూ విద్యార్థులు, విద్యార్థి సంఘాలు బంద్‌లో పాల్గొంటున్నాయి. ఉద్యోగులను విధులకు హాజరుకాకుండా అడ్డుకున్నారు. ఇకపోతే తెలంగాణలోని కరీంనగర్ శాతవాహన, నిజామాబాద్ తెలంగాణ యూనివర్సిటీల్లో కూడా బంద్ పాటించారు. హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ కరీంనగర్ జిల్లా సైదాపూర్‌లో రాజకీయ ఐకాస ఆధ్వర్యంలో విద్యాసంస్థలను మూసివేశారు. రోహిత్ కుటుంబానికి న్యాయంచేయాలని ఈ సందర్భంగా పలువురు నాయకులు డిమాండ్‌చేశారు. మండలకేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లోని విద్యాసంస్థలను బంద్‌చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయపార్టీల నేతలు, విద్యార్థి, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.