ఓయూ , కేయూ మెడికల్ కళాశాలల్లో
అదనపు సీట్లు కేటాయించండి
ఎంసీఐని ఆదేశించిన హైకోర్టు
హైదరాబాద్, జూలై 13 (జనంసాక్షి) : తెలంగాణ ప్రాంతంలోని మెడికల్ కళాశాలల్లో అదనపు సీట్ల కేటాయింపు వ్యవహారం వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో హైకోర్టు శుక్రవారం సంచలనాత్మక తీర్పును ఇచ్చింది. తెలంగాణ ప్రాంతంలోని ఉస్మానియా, కాకతీయ, గాంధీ, ఆదిలాబాద్ మెడికల్ కళాశా లల్లో అన్ని సౌకర్యాలు ఉండికూడా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) అదనపు సీట్ల కేటాయింపునకు నిరాకరించింది. సీమాంధ్ర ప్రాంతంలోని మెడికల్ కళాశాల ల్లోఎంసీఐ అదనపు సీట్లకు అనమతి ఇచ్చింది. ఈ అంశంపై తెలంగాణ రాష్ట్ర సమితితోపాటు తెలంగాణ ప్రాంత ఎంపీలు సైతం రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఈ విషయంలో కేంద్ర, వైద్య, విద్యా శాఖ మంత్రి గులాంనబీ ఆజాద్‌కు కూడా ఫిర్యాదు చేశారు.అదనపు సీట్ల కేటాయింపుపై తెలంగాణ ప్రాంత వాసి హైకోర్టును హైకోర్టును ఆశ్రయించారు. దీంతో అన్ని కళాశాలల్లో మౌలిక వసతులు, సౌకర్యాలను పరిశీలించిన హైకోర్టు కాకతీయ, ఉస్మానియా మెడికల్ కళాశాలల్లో 50 సీట్ల చొప్పున అదనంగా కేటాయించాలంటూ ఎంసీఐని ఆదేశించింది. దీంతో అదనపు మెడికల్ సీట్ల వ్యవహారం ఒక కొలిక్క వచ్చినట్టయింది. దీనిపై వైద్య విద్యా శాఖ మంత్రి కొండ్రు మురళీ స్పందిస్తూ గాంధీ మెడికల్ కళాశాలలో కూడా అదనపు సీట్లకై ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. రెండు రోజుల్లో ఓయూ, కేయూ మెడికల్ కళాశాలల పరిస్థితిని మెరుగు పరచాలంటూ ప్రభుత్వాన్ని కూడా ఆదేశించింది.