ఓసీ విద్యార్థులకు గురుకులాలు ఏర్పాటు చేయాలి
ప్రతిభ ప్రామాణికంగా ప్రాధాన్యత ఇవ్వాలి
* ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు
కరీంనగర్ బ్యూరో ( జనం సాక్షి ) :
ఓసీల్లోని ఈడబ్ల్యుఎస్ విద్యార్థులకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో గురుకుల పాఠశాల , జిల్లా కేంద్రంలో గురుకుల కళాశాలలు ఏర్పాటు చేయాలని ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు డిమాండ్ చేశారు . శుక్రవారం నగరంలోని ప్రెస్ భవన్లో ఓసీ సమాఖ్య నాయకులతో నిర్వహించిన సమావేశంలో రామారావు మాట్లాడుతూ ఓసీ యేతరులకు తాము వ్యతిరేకం కాదని , ఓసీల్లోని పేద ఈడబ్ల్యుఎస్ విద్యార్థులకు కూడా గురుకులాలు ఏర్పాటు చేసి సమన్యాయం జరపాలన్నదే తమ ధ్యేయమని అన్నారు . స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయినా కూడా కులాల అంతరాలు పెంచడం సమంజసం కాదని , కుల రహిత సమాజం కోసం పాలకులు కృషి చేయాలన్నారు . ఓసీలను ఓటు బ్యాంకుగా రాజకీయ పార్టీలు చూడటం మానుకోవాలన్నారు . దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అనాటి పరిస్థితులకనుగుణంగా వెనుకబడిన దళిత , గిరిజన , ఆదివాసీల కోసం పదేళ్ల కాల పరిమితితో కేవలం విద్యా , ఉద్యోగాల్లో 22 శాతం రిజర్వేషన్లను మాత్రమే రాజ్యాంగం కల్పించిందన్నారు . రాజ్యాంగం ప్రకారం పదేళ్లకు ముగించాల్సిన రిజర్వేషన్లను ఓటు బ్యాంకు స్వార్థ రాజకీయాలలో గత 75 ఏళ్లుగా అట్టి 22 శాతం రిజర్వేషన్లను నేడు 50 శాతం వరకు విద్యా , ఉద్యోగాల్లో అమలుపరుస్తూ రాజకీయ రిజర్వేషన్లను కూడా కొనసాగిస్తున్నారని మండిపడ్డారు . దీంతో జ్ఞాన సముపార్జన కలిగిన ప్రతిభావంతులకు తీవ్ర అన్యాయం జరిగి విదేశాలకు వలసలు పెరిగి మేధోసంపత్తిని కోల్పోయి దేశం తీవ్రంగా నష్టపోయిందన్నారు . ఇంజనీరింగ్ , వైద్య , వ్యవసాయ , పరిశోధనలు , శాస్త్ర , సాంకేతిక రంగాల్లో రిజర్వేషన్లతో సంబంధం లేకుండా ప్రతిభకు మాత్రమే ప్రాధాన్యత కల్పించినప్పుడే దేశాభివృద్ధికి , మెరుగైన ఆరోగ్యకర సమాజ వికాసానికి దోహదం జరుగుతుందన్నారు . ప్రస్తుతం దేశంలో అమలవుతున్న రిజర్వేషన్ల విధానం మార్చి కుల , మత ప్రాతిపదికన కాకుండా ఆర్థిక స్థితిగతుల ఆధారంగా అన్నివర్గాల పేదలకు విద్యా , ఉద్యోగ , సంక్షేమ రంగాల్లో సమన్యాయం జరుగుటకు ప్రత్యేక రాజ్యాంగ కమిషన్ ఏర్పాటు చేసి పార్లమెంట్లో చర్చించి ప్రత్యేక చట్టం తేవాలని పోలాడి రామారావు డిమాండ్ చేశారు . ఈ కార్యక్రమంలో ఓసి జెఎసి సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ దీపక్ బాబు నాయకులు అండెం రమణారెడ్డి మంతెన మధుసూదన్ రావు జిల్లా అంజయ్య సేహెచ్ మహేందర్ రెడ్డి మంతెన ప్రశాంత్ కుమార్ చేకూరి అశోక్ తదితరుల పాల్గొన్నారు.