ఓ అధ్భుత ఘట్టం ఆవిష్క ృతం
చరిత్రలో జనంసాక్షిగా ఖమ్మం
గులాభిమయమైన మెట్టు
భారీకటౌట్లు స్వాగత తోరణాలతో సర్వాంగా సుందరంగా ముస్తాబైన ఖమ్మం
ఖమ్మం బ్యూరో,ఏప్రిల్ 26 (జనంసాక్షి):
ఉద్యమాల గుమ్మంగా ప్రసిద్ధి గాంచిన ఖమ్మంలో టీఆర్‌ఎస్ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరగబోతున్నాయి. జిల్లా చరిత్రలో నిలిచిపోయేలా కనివినీ ఎరుగని రీతిలో ప్లీనరీని నిర్వహించేందుకు గులాబీదళం సమాయమత్తమవుతోంది. ఉదయం ప్లీనరీ, సాయంత్రం బహిరంగసభ జరగనుంది. ఖమ్మం సవిూపంలో చెరుకూరి గార్డెన్స్ లో ప్లీనరీ, ఎస్‌ఆర్ అండ్ బీజీఎన్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఖమ్మం వేదికగా సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనుండడంతో గులాబీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పకడ్బందీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. జిల్లా పార్టీ అధ్యక్షులు ఎస్బీ బేగ్, ఇతర ముఖ్య నేతలు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ప్లీనరీ కోసం రెండువేల చదరపు విూటర్ల ప్రాంగణాన్ని నిర్మించారు. 160 చదరపు అడుగుల వెడల్పు, 360 చదరపు అడుగుల పొడవుతో విశాలమైన ప్రాంగణాన్ని నిర్మించారు. పదిహేను అడుగుల ఎత్తులో 30 అడుగుల పొడవు, 60 అడుగల వెడల్పుతో వేదిక రెడీ అయ్యింది. ప్రాంగణంలోనే 36/18 అడుగుల పొడవు, వెడల్పులతో సీఎం కేసీఆర్‌కు విశ్రాంతిగదిని కూడా రూపొందించారు.
ప్లీనరీ వేదికపై 24 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. సీఎం కేసీఆర్తో పాటు రాష్ట్ర మంత్రివర్గం, రాజ్యసభ, లోక్సభలో పార్టీ నాయకులు కే కేశవరావు, ఏపీ జితేందర్రెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్రావు, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్రెడ్డి వేదికపై ఉంటారు. ప్రస్తుత ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకుపైనే నమోదవుతున్న నేపథ్యంలో ప్లీనరీ ప్రాంగణాన్ని చల్లగా మార్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 150 టన్నుల ఏసీలు, 60 జంబోకూలర్స్తోపాటు జైన్ డ్రిప్ అండ్ స్ప్రింక్లర్ కంపెనీ సహకారంతో ఎయిర్ మిక్స్తో వాటర్ స్ప్రే యంత్రాలను అమర్చుతున్నారు. అవి నిరంతరం పనిచేస్తూ అతిథులపై మంచు తుంపరల మాదిరిగా నీటిని కురిపిస్తూ ఎండవేడి నుంచి కాపాడనున్నాయి. రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై పార్టీ ప్లీనరీలో చర్చజరిగే అవకాశం ఉంది. ప్రధానంగా 15 అంశాలను ఎజెండాలో చేర్చినట్లు సమాచారం.
ఇక ప్లీనరీకి వచ్చే అతిథులకు, మహిళా డెలిగేట్స్ కు వేర్వేరుగా వసతిని కల్పించనున్నారు. డెలిగేట్స్ కు ఉదయం ఏడు గంటల నుంచి అల్పాహారాన్ని అందించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 గంటల వరకు భోజన విరామం ఉంటుంది. 12 నుంచి 15 వేల మందికి తగ్గట్లుగా భోజనాల ఏర్పాట్లు చేస్తున్నారు. అతిధుల కోసం నోరూరించే వంటకాలు రెడీ అవుతున్నాయి. మధ్యమధ్యలో టీ, కాఫీ, మజ్జిగ, శీతల పానీయాలు, స్నాక్స్, జావ, పకోడి, గారెలు వంటి అల్పాహారాన్ని అందించడం కోసం వాలంటీర్లను నియమించారు.
ప్లీనరీకి వచ్చే వాహనాల పార్కింగ్‌కు చెరుకూరి గార్డెన్స్ సవిూపానే ఉన్న దాదాపు 15 ఎకరాల ఖాళీ స్థలాన్ని కేటాయించారు. ప్లీనరీకి వచ్చే ప్రతినిధులతో పాటు వాలంటీర్స్, విూడియా ఎవరైనా సరే తప్పనిసరిగా పాస్ తెచ్చుకుంటేనే లోపలికి అనుమతిస్తారు. ఖమ్మంతోపాటు మిగతా తొమ్మిది జిల్లాల ప్రతినిధులు తమ వివరాలను ఎన్‌రోల్ చేసుకోవటానికి జిల్లాకు ఒకటి చొప్పున ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. మండుతున్న ఎండల నేపథ్యంలో పార్టీ శ్రేణులకు ఇబ్బందులు లేకుండా కొందరికి మాత్రమే ప్లీనరీకి ఆహ్వానించారు. సుమారు 4 వేల మంది ప్రతినిధులకు ఆహ్వానం అందింది. ప్లీనరీకి కార్యకర్తలంతా రావొచ్చనే భావనలో ఉన్నారని.. అయితే కేవలం నాలుగు వేల మంది ప్రతినిధులకే ప్లీనరీకి అనుమతి ఉంటుందని పార్టీ నేతలు స్పష్టం చేశారు.
సాయంత్రం జరగనున్న బహిరంగసభకు మూడు నుంచి ఐదు లక్షల మంది జనం వస్తారని అంచనా వేస్తున్నారు. అందుకే అక్కడ కూడా పెద్దెత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఖమ్మం నగరంలో ప్లీనరీతో పాటు బహిరంగసభ జరగబోతున్న తరుణంలో ఎక్కడ చూసిన గులాబీ జెండాలే కనిపిస్తున్నాయి. నగరంలోని ప్రధాన వీధులు, జంక్షన్లు గులాబీమయంగా మారాయి. అడుగడుగునా సీఎం కేసీఆర్ కటౌట్లు, స్వాగత ఫ్లెక్సీలు వెలిశాయి. మునుపెన్నడూ లేనివిధంగా ప్రైవేటు ప్రచార బోర్డులన్నీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల సమాచారంతో నిండిపోయాయి.
ఖమ్మంలో ప్లీనరీతో పాటు బహిరంగసభను విజయవంతం చేసి సత్తా చాటుతామంటున్నారు టీఆర్‌ఎస్ నేతలు. జిల్లా చరిత్రలోనే ఈ ఆవిర్భావ వేడుకలు మైలురాయిగా నిలిచిపోవడం ఖాయమంటున్నారు.




