ఓ ఐఏఎస్ పరిస్థితే ఇలా ఉంటే సాధారణ మహిళల పరిస్థితి ఎలా ఉంటుంది
– అవుట్ లుక్ కథనం స్మితా సబర్వాల్ ఆవేదన
హైదరాబాద్,జులై1(జనంసాక్షి):
నాపైనే ఇలా రాస్తే ఇక సాధారణ మహిళల పరిస్థితి ఏంటి..? అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి పేషీలో అదనపు కార్యదర్శిగా పనిచేస్తున్న స్మిత సబర్వాల్ ఆవేదన వ్యక్తం చేశారు.పద్నాలుగు సంవత్సరాలుగా ఐఎఎస్ అధికారిగా కొనసాగుతున్న తనపైనే ఒక పత్రిక ఇలా వేధింపులకు దిగితే ,ఇక సాధారణ మహిళల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఔట్ లుక్ పత్రిక ఇంత నీచంగా తనపై కార్టూన్ ను వేయడం, కథనాన్ని రాయడం చేస్తుందా అని ఆమె మండిపడ్డారు. ఇది తనను అవమానించడం కాదని, మొత్తం మహిళాలోకాన్ని అవమానించినట్లు అని ఆమె వ్యాఖ్యానించారు. దీనిపై న్యాయ పోరాటానికి సిద్దం అవుతున్నానని అన్నారు. తాను పుట్టిన రోజున భర్తతో కలిసి ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్నానని ,ఆనాటి డ్రెస్ ను సూచిస్తూ ఇంత దారుణంగా వ్యవహరిస్తారని అనుకోలేదని స్మిత వాపోయారు. స్మితపై అబ్యంతరకరమైన రీతిలో వార్త ప్రచురించిన ఔట్ లుక్ పత్రికపై నిరసన వ్యక్తం అవుతోంది. దీనిపై ఔట్ లుక్ పత్రిక క్షమాఫణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. తన పరువుకు నష్టం కలిగించేలా, అమర్యాదకరంగా, అభ్యంతరకరంగా, అశ్లీలం ధ్వనించేలా ఔట్‌లుక్ పత్రిక ప్రచురించిన కథనంపై ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్ న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు. ఔట్‌లుక్ ఎడిటర్ ఇన్ చీఫ్ కృష్ణప్రసాద్‌కు, కథనం రాసిన అసిస్టెంట్ ఎడిటర్ (హైదరాబాద్) మాధవి తాతలకు లీగల్ నోటీసు పంపారు. డీప్ థ్రోట్ పేరుతో కావాలని తప్పుగా రాసిన కాలమ్‌లో పేర్కొన్న విషయాలు తన క్లయింట్‌కు తీవ్ర మనోవేదన కలిగించాయని స్మితా సబర్వాల్ న్యాయవాదిఆ నోటీసుల్లో పేర్కొన్నారు. వ్యక్తిగతంగా, వృత్తిపరంగానూ నష్టం జరిగిందని, దీనికి పత్రిక బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌చేశారు. బహిరంగ క్షమాపణలు చెప్పకుంటే పరువునష్టం కేసు కింద సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు. ఇదిలావుంటే ఔట్‌లుక్‌పై చర్యలు తీసుకోవాలంటూ తెలంగాణ లాయర్ జెఎసి మానవహక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేసింది. ఇది ఓ మహిళను అవమానించడమేనని వారు పేర్కొన్నారు. ఇంత దారుణంగా కథనం రాసిని ఔట్‌లుక్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అధికారి అన్న గౌరవం, మహిళ అనే మర్యాద లేకుండా స్మితాసబర్వాల్‌పై అసభ్య కార్టూన్లు వేసి, దానిని పాత్రికేయం అనుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. పత్రిక యాజమాన్యం బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. స్మితా సబర్వాల్‌ను పరోక్షంగా ఉద్దేశిస్తూ వేసిన క్యారికేచర్, అభ్యంతరకర వ్యాఖ్యానాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, పత్రిక యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని మహిళా ఐఎఎస్‌లు విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన సీఎస్ వెంటనే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. ట్‌లుక్ వారపత్రిక వ్యాసంపై సర్వత్రా విమర్శలు, ఆగ్రహం వ్యక్తమవుతున్నాయి. ఇదంతా చిల్లర జర్నలిజమని, ఎల్లో జర్నలిజమని పలువురు సీనియర్ పాత్రికేయులు మండిపడ్డారు. ఔట్‌లుక్ వ్యాసం స్త్రీ వ్యక్తిత్వంపై జరిగిన దాడి అని సీనియర్ జర్నలిస్ట్ వనజ అన్నారు. వీటిని జర్నలిస్టులే కాకుండా సమాజమంతా ఖండించాలని వీక్షణం ఎడిటర్ వేణుగోపాల్ అభిప్రాయపడ్డారు. ఈ రాతలు జర్నలిజాన్ని దిగజార్చేలా ఉన్నాయని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (టీయూడబ్ల్యూజే) అభివర్ణించింది. తక్షణం ఔట్‌లుక్ పత్రిక క్షమాపణ చెప్పాలని ఆ సంఘం నేత క్రాంతి కిరణ్ డిమాండ్ చేశారు. అభ్యంతరకర రాతలు రాసిన మాధవి తాత తెలంగాణ సమాజానికి, స్త్రీ జాతికి క్షమాపణలు చెప్పాలని సీనియర్ జర్నలిస్ట్ ,ఆర్‌ఎన్‌ఎ చీఫ్ ఎడిటర్ అవ్వారు రఘుసూచించారు. ఇది సభ్యసమాజం తలదించుకునేలా ఉందన్నారు. ఈ కథనంపై నిరసన కార్యక్రమాలు చేపడతామని టీయూడబ్ల్యూజే మహిళా విభాగం నేతలు ప్రకటించారు. దురుద్దేశంతో వార్త రాసిన ఔట్‌లుక్ పత్రికపై రాష్ట్ర విూడియా అక్రెడిటేషన్ కమిటీ సీరియస్ అయింది. మంగళవారం సమాచారశాఖ కార్యాలయంలో ప్రెస్ అకాడవిూ చైర్మన్ అధ్యక్షతన సమావేశమైన అక్రెడిటేషన్ కమిటీ ఔట్‌లుక్ పత్రికలో పనిచేసే జర్నలిస్టులకు తెలంగాణ రాష్ట్ర అక్రెడిటేషన్లు ఇవ్వకూడదని ఏకగ్రీవంగా నిర్ణయించింది. స్మితా సబర్వాల్‌పై ఔట్‌లుక్ పత్రిక రాసిన కథనాన్ని పరిశీలిస్తే రాసిన రిపోర్టర్‌కు, అచ్చువేసిన పత్రిక యజమాన్యానికి మహిళలపై వివక్షత, తెలంగాణ ప్రభుత్వంపై చిన్న చూపు ఉందని స్పష్టమవుతుందని తెలంగాణ ప్రెస్ అకాడవిూ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. ఈ కథనం జర్నలిస్టుల ప్రమాణాలను మంటగలిపిందన్నారు.