ఓ పదిమంది వ్యాపారుల కోసం మోడీ  ఆర్థిక సంస్కరణలు

Gandhinagar: Congress Vice President Rahul Gandhi addresses a public meeting in Gandhinagar, Gujarat on Monday. PTI Photo (PTI10_23_2017_000149B)

గుజరాత్‌ అభివృద్ది మేడిపండు చందం
అన్ని వర్గాలూ ఆందోళనలో ఉన్నాయి
గుజరాత్‌ ప్రచారంలో రాహుల్‌ మండిపాటు
గాంధీనగర్‌,నవంబర్‌1(జ‌నంసాక్షి): గుజరాత్‌ అభివృద్ధి మేడిచందం అంటూ  ప్రధాని నరేంద్ర మోదీపై మరోసారి కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సెటైర్లు విసిరారు. మోదీ చేపట్టిన ఆర్ధిక సంస్కరణలు కేవలం కొంత మంది వ్యాపారవేత్తలకే ఉపయోగపడుతున్నాయని తెలిపారు. గుజరాత్‌లోని భరూచ్‌లో ఎన్నికల ప్రచారసభలో ఆయన పాల్గొన్నారు. గుజరాత్‌ను మోడల్‌గా తీర్చుదిద్దుతామన్న ప్రధాని మోదీ పూర్తిగా వైఫల్యం చెందారంటూ విమర్శించారు. మోదీ ఆర్థిక సంస్కరణలపై అందరూ విమర్శిస్తున్నారని అన్నారు. కానీ కేవలం 10 వ్యాపారవేత్తల నుంచి మాత్రం విమర్శలు రావడంలేదని అన్నారు. మోదీ ఆర్థిక సంస్కరణలతో వారు చాలా సుఖంగా ఉన్నారని అన్నారు. వారంతా మోదీని, గుజరాత్‌ సీఎంను సమర్థిస్తున్నారని రాహుల్‌ అన్నారు. గుజరాత్‌లో టాటా నానో ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం.. ఆ కంపెనీకి మోదీ పూర్తిగా దాసోహమయ్యారని రాహుల్‌ విమర్శించారు. కంపెనీ ఏర్పాటు కోసం బ్యాంకుల నుంచి ఉచిత వడ్డీకి రూ. 33 వేల కోట్ల రూపాయలు అప్పుగా ఇప్పించారని తెలిపారు. పేదల నుంచి భూములు లాక్కున్నారని విమర్శించారు. అయినప్పటికీ దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా టాటా నానో కారు రోడ్లపై కనిపించదంటూ దుయ్యబట్టారు. ఇదేనా మోదీ మోడల్‌ గుజరాత్‌ అని రాహుల్‌ ప్రశ్నించారు. గుజరాత్‌లోని రైతులు కన్నీరు పెడుతున్నారు. గుజరాత్‌వాసులు సంతోషంగా లేరు. పేదల ప్రజలకు కనీసం నీటి సదుపాయం కూడా లేదు. కేవలం ఐదుగురు వ్యాపారవేత్తలు మాత్రమే బాగున్నారు. వారికి మోదీ అండగా ఉన్నారు. సులువుగా వ్యాపారం చేసుకునేందుకు భారత్‌ అనువుగా లేదు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ ఆందోళనకర పరిస్థితుల్లో ఉంది.’ అని రాహుల్‌ విమర్శించారు.  నిరుద్యోగుల కు ఉద్యోగావకాశాలు కల్పించడంలో ప్రధాని మోదీ ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు. భారత్‌లో వ్యాపారం సులువు కాదని.. కావాలంటే చిన్నవ్యాపారస్థులును అడగాల్సిందిగా రాహుల్‌ సూచించారు. అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో మోదీ సాధించినది ఏవిూ లేదని ఎద్దేవా చేశారు. ఎంత మంది స్విస్‌ బ్యాంకు ఖాతాదారులను జైల్లో పెట్టారో చెప్పాల్సిందిగా ఆయన నిలదీశారు. బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణాలను ఎగ్గొట్టిన విజయ్‌ మాల్యా ఇంగ్లాండ్‌లో ఎంజాయ్‌ చేస్తున్నాడని రాహుల్‌ ఎద్దేవా చేశారు.