ఔట్‌సోర్సింగ్ కింద పిలిచిన టెండర్లు రద్దు చేయాలి
నిజామాబాద్, నవంబర్ 6 : ఔట్‌సోర్సింగ్ కింద కార్పొరేషన్‌లో పబ్లిక్‌హెల్త్ విభాగంలో పిలిచిన టెండర్లను రద్దు చేయాలని కోరుతూ ఎఐటియుసి, ఐఎఫ్‌టియు ఆద్వర్యంలో రెండవ రోజు కార్పొరేషన్ ఎదుట పబ్లిక్ హెల్త్ వర్కర్లు ధర్నా మంగళవారం కూడా కొనసాగించారు. ఈ సందర్భంగా ఓమయ్యలు మాట్లాడుతూ కార్పొరేషన్‌లో కామన్ ఇన్‌ట్రెస్ట్ గ్రూపులుగా, సొసైటీలుగా ఏర్పడిన కార్మికులు అవుట్ సోర్సింగ్ కింద పబ్లిక్ హెల్త్ విభాగంలో గత 15 సంవత్సరాలుగా పని చేస్తున్నారని అన్నారు. ఈ కార్మికులతో పని చేయించుటకు మూడు నెలలకోసారి అడ్మిస్ట్రేషన్ ఆమోదం తీసుకొని, అగ్రిమెంట్ చేసుకొని ఇప్పటి వరకు పనిచేయించారని తెలిపారు. కానీ ఆ పద్దతి కాకుండా కొత్తపద్ధతిలో టెండర్లు పిలిచి పని చేయించటానికి పూనుకుంటున్నారని ఆరోపించారు. ఈ పద్ధతివల్ల టెండ ర్లలో ఎవరు తక్కువరేట్ కోడ్ చేస్తే వారికే పని వస్తుందన్నారు. అలాంటప్పుడు సిఐజి గ్రూపుల, సొసైటీల కింద గల కార్మికులకు పని లేకుండా పోతుందన్నారు. పనిభారం పెరిగిపోతుందని, దానికితోడు వేధింపులు, పనిఒత్తిడులు పెరిగిపోతున్నాయన్నా రు. కాబట్టి గతంలో కొనసాగిన పద్ధ తినే అమలు చేయాలని, పిలిచిన టెండర్లను తక్షణమే రద్దు చేయాలన్నారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీలో సానిటరీ విభాగంలో డ్రెయిన్ క్లీనర్లుగా, స్వీపర్లు పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు దళారిలు దోపిడి చేయకుండా, కాంట్రాక్టర్ల దోపిడి, మధ్యవర్తుల దోపిడి లేకుండా ఉండటానికే సిఐజి గ్రూపులుగా, సొసైటీలుగా ఏర్పడాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రొత్సామించాయని అన్నారు. ఈ గ్రూపులలో మెజార్టీ దళితులు, వెనుకబడిన, బలహీన వర్గం వారన్నారని అన్నారు. ఈ ధర్నాలో ఐఎఫ్‌టియు నాయకులు శివనారాయణ, కళావతి, జనార్ధన్, ఎఐఎఫ్‌టియు నాయకులు నర్సింగరావ్, దర్శవ్వ, యశ్వంతలు పాల్గొన్నారు.