కంటివెలుగు పథకం విజయవంతం కోసం ఏర్పాట్లు
మహబూబ్‌నగర్,ఆగస్ట్9(జనం సాక్షి): నెల 15వ తేదీ నుంచి రాష్ట్రంలో ఆరంభించనున్న కంటి వెలుగు కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లన్ని సిద్ధం చేశామని కంటి వెలుగు జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ వినోద్‌కుమార్ తెలిపారు. వైద్య పరీక్షలను నిర్వహించేందుకు అవసరమైన సిబ్బందిని ఎంపికచేసి అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందన్నారు. ఇందుకు అవసరమైన వారికి ఆపరేషన్లను చేయడంతో పాటు కంటి అద్దాలను కూడా సిద్ధంగా ఉంచడం జరిగిందని పేర్కొన్నారు. మహబూబ్‌నగర్, గద్వాల జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు విస్తృతంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. మండల, జిల్లా స్థాయిలో కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే అవగాహన కార్యక్రమాలను నిర్వహించామన్నారు. కంటివెలుగుపై ప్రజల్లో పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు అవసరమైన చర్యలు చేపట్టామన్నారు. వైద్య సిబ్బందికి శిక్షణను కూడా ఇచ్చామని, వైద్య పరీక్షల నిర్వహణ కోసం 17 టీంలను ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రజలకు కంటి వైద్య పరీక్షలను నిర్వహించేందుకు రవాణా సౌకర్యాలను ఏర్పాటు చేస్తే మరిన్ని ప్రయోజనాలు కలిగే అవకాశాలు ఉంటాయని సూచించారు. కంటి వైద్యంపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడం, ఆపరేషన్లు అంటే భయపడే పరిస్థితులు ఉంటాయి. వాటిని అధిగమించి కార్యక్రమాలను నిర్వహించేందుకు వైద్య సిబ్బందిని సిద్ధం చేశామని వివరించారు.