కందిపప్పు ధరలపై మహారాష్ట్ర ఉక్కుపాదం: దిగొచ్చిన రేటు

ముంబై: దేశవ్యాప్తంగా నిప్పుల్ని తలపిస్తున్న కందిపప్పు ధరలపై మహారాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. కందిపప్పును పెద్ద ఎత్తున నిల్వ చేసి దీని ధర రూ.200 పైచిలుకు చేరుకోవడానికి కారకులైన అక్రమార్కులపై ఫడ్నవిస్ సర్కారు దాడులతో దడపుట్టించింది. ఏకబిగిన ఐదు రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు చేసిన దాడులతో ప్రస్తుతం కిలో కందిపప్పు ధర రూ.200 నుంచి రూ.150 వరకూ దిగొచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2,500 దాడుల్ని నిర్వహించిన మహారాష్ట్ర అధికారులు అక్రమంగా దాచి ఉంచిన 46,397 మెట్రిక్ టన్నుల పప్పుధాన్యాలు, నూనె గింజల్ని స్వాధీనం చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ స్థాయిలో దాడులు జరిగితే తప్ప పరిస్థితి అదుపులోకి వచ్చేలా లేదు.