కట్టు దిట్టమైన భద్రత మధ్య మావోయిస్టు ప్లీనం విజయవంతం

4
– స్పెషల్‌ జోన్‌ అధికార ప్రతినిధిగా విఠల్‌

– రామన్న ప్రకటన

హైదరాబాద్‌,జనవరి13(జనంసాక్షి):కట్టు దిట్టమైన భద్రత మధ్య చేపట్టిన మావోయిస్టు ప్లీనం విజయవంతమైందని భారత మ్యూనిస్తు పార్టీ( మావోయిస్టు) దండకారణ్య స్పెషల్‌ జోనల్‌య కమిటీ కార్యదర్శి  రామన్న ఒక ప్రకటలో తెలిపారు. ఈ ప్లీనంలో స్పెషల్‌ జోన్‌ అధికార ప్రతినిధిగా విఠల్‌ నియమించనట్లు ఆయన పేర్కొన్నారు.  దండకారణ్య ప్లీనం విజయవంతమైందని కార్యదర్శి రామన్న పేర్కొన్నారు. విప్లవోద్యమానికి లభించిన దేశీయ, అంతర్జాతీయ మద్ధతుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల దండకారణ్య స్పెషల్‌ జోన్‌ నాలుగవ మహాసభ రెండవ ప్లీనం దండకారణ్యంలోని ఒక గెరిల్లా స్థావరం ప్రాంతంలో ప్రజా విముక్తి గెరిల్లా సేన కట్టుదిట్టమైన రక్షణలో ప్రజల సంపూర్ణ సహకారంతో విజయవంతంగా జరిగింది. ఈ ప్లీనం 2011లో విజయవంతం అయిన మొదటి ప్లీనం నుండి ఇప్పటి దాకా గడిచిన నాలుగు సంవత్సరాల విప్లవోద్యమాన్ని సమీక్షించింది. పార్టీ, పీఎల్‌జీఏ,ఐక్య సంఘటన రంగాల్లో మా పని, సాధించిన ఫలితాలు, బలహీనతలు, లోపాల విశ్లేషణ పునాదిగా ప్లీనం రాజకీయ, నిర్మాణ సమీక్షను ఆమోదించింది. తక్షణ కర్తవ్యాలను నిర్ధేశించుకుంది. పార్టీ, పీఎల్‌జీఏ, ఐక్య సంఘటనలకు చెందిన శ్రేణులను బోల్షివీకరణ ద్వారా సుదృఢం చేయాలనీ, విప్లవ ప్రజా యుద్దాన్ని ఉధృతం చేసి ఆపరేషన్‌ గ్రీన్‌హంట్‌ను ఓడించాలనీ, ప్రజల ప్రజాస్వామిక రాజ్యాధికార అంగాలైన క్రాంతికారీ జనతన సర్కార్లను బలోపేతం చేసి, విస్తరింపచేయాలనీ ప్లీనం నిర్ణయించుకొంది. దేశ, ప్రపంచ పరిస్థితులను విశ్లేషిస్తూ, దేశంలోని ప్రపంచంలోని ప్రముఖ వైరుధ్యాలు దిన దినం పదునెక్కుతూ పోతున్నాయనీ, ఆర్థిక, రాజకీయ,సైనిక పరిణామాలు మునుపెన్నటి కంటే విప్లవానికి అత్యంత అనుకూలంగా, దోపిడీ పాలక వర్గాలకు వ్యతిరేకంగా తయారవుతున్నాయని ప్లీనం అంచనా వేసింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మహా మాంద్యం ఊబిలో కూరుకుపోతూ వున్నది. సామ్రాజ్యవాద దేశాలన్నీ ఫాసిజాన్ని ఆసరా చేసుకొంటున్నాయి. ఇటువంటి స్థితిలో ప్రజల ఎదుట విప్లవం మినహా మరే ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. సాహసం, త్యాగనిరతితో పోరాడి విజయం సాధిస్తామనే ఆశను, పూర్తి విశ్వాసాన్నీ ప్లీనం వ్యక్తం చేసింది. గత నాలుగేళ్ల కాలంలో దండకారణ్య విప్లవోద్యమానికి లభించిన దేశీయ, అంతర్జాతీయ మద్దతుకు ప్లీనం విప్లవాభివందనాలతో పాటు ధన్యవాదాలు తెలియజేసింది. భాజపా మోదీ ప్రభుత్వం అధికారంతోకి వచ్చిన తర్వాత నుండి ఒకవైపు ప్రజా వ్యతిరేక, దేశ వ్యతిరేక, సామ్రాజ్యవాద అనుకూల ఉదారీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ విధానాలను దూకుడుగా అమలు చేస్తున్నది. మరోవైపు బ్రాహ్మణీయ హిందూత్వ ఫాసిస్టు ఎజెండాను వేగంగా ముందుకు తీసుకుపోతున్నది. ఈ విధానాల ఫలితంగా రైతులు, కార్మికులు, దళితులు, ఆదివాసీలు మతపర మైనారీటీలు, మహిళలు సహా పీడిత వర్గాల ప్రజల కష్టాలు, వారిపై నిర్భంధం, అత్యాచారాలు నిరంతరం పెరుగుతున్నాయి. దేశంలో పెరుగుతున్న అసహనం,దాని పట్ల ప్రభుత్వ ఉదాశీన వైఖరికి వ్యతిరేకంగా వందకు పైగా ప్రఖ్యాత రచయితలు,కళాకారులు, మేధావులు, శాస్త్రవేత్తలు తమ పురస్కారాలను తిప్పికొట్టే అపూర్వ, అసమాన ప్రతిస్పందనను ప్లీనం స్వాగతిస్తున్నది. మోదీ ప్రభుత్వ బ్రాహ్మణీయ హిందూత్వ ఫాసిజానికి వ్యతిరేకంగా విశాల, సంఘటిత, సమరశీల ఐక్య సంఘటన ఏర్పాటుకు అన్ని పీడిత వర్గాల ప్రజలు, లౌకిక శక్తులు, మేధావులు, విద్యార్థులు, యువత, రచయితలు, కళాకారులు, శాస్త్రవేత్తలు, ప్రసార మాధ్యమాల ఉద్యోగులు, వామ పక్ష పార్టీలకు ప్లీనం పిలుపునిచ్చింది.దేశవ్యాపిత ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌ రైతులకు ఆత్మహత్యలు చేసుకోవద్దనీ, సమస్యల పరిష్కారానికి ప్రజా యుద్ధ బాటను ఎంచుకోవాలనీ ప్లీనం పిలుపునిచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానలను ప్లీనం తీవ్రంగా ఖండించింది. దశాబ్దాల పోరాట ఫలితాలను కాపాడుకోవడానికి కార్మిక పోరాటాలను ఉధృతం చేయాలని పిలుపునిచ్చింది.జల్‌, జంగల్‌, జమీన్‌, వనరులతో పాటు అస్తిత్వం, గుర్తింపు, హక్కులను నిలుపుకోవడానికి నిర్వాసిత వ్యతిరేక పోరాటాలను ఉధృతం చేయాలని,రైతులు, ఆదివాసులు, సాధారణ ప్రజలకు ప్లీనం పిలుపునిచ్చింది. దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ తన అధికార ప్రతినిధిగా కామ్రేడ్‌ వికల్ప్‌ను నియమించుకుందని పఠన, శ్రవణ, దృశ్య మాధ్యమాలకు తెలియజేస్తున్నాం.ఇక నుండి పత్రికా ప్రకటనలు, విభిన్న విషయాలపై పార్టీ వైఖరి ఇదే పేరుతో వెల్లడవుతాయి.