కదులుతున్న ఢిల్లీ పీఠం
– అన్నదాత అలుపెరగని పోరాటం
– దేశవ్యాప్తంగా పెరుగుతున్న మద్ధతు
– బంద్‌లో పాల్గొననున్న కాంగ్రెస్, తెరాస, డీఎంకే, ఆప్
న్యూఢిల్లీ, డిసెంబరు 6(జనంసాక్షి):కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ దేశ రాజధాని సరిహద్దుల్లో రైతులు చేపట్టిన ఆందోళనకు అంతకంతకూ మద్దతు పెరుగుతోంది. పలు దఫాలుగా కేంద్రంతో జరిపిన చర్చలు విఫలమవ్వడంతో రైతు సంఘాలు ఈ నెల 8న భారత్ బంద్ తలపెట్టాయి. ఈ నేపథ్యంలో రైతుల ఆందోళనకు పలు రాజకీయ పార్టీలు సంఘీభావం ప్రకటించాయి. బంద్‌లో పాల్గొంటామని కాంగ్రెస్, తెరాస, డీఎంకే, ఆప్ తదితర పార్టీలు ప్రకటించాయి. వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోకుంటే తన ఖేల్‌రత్న అవార్డు వెనక్కి ఇచ్చేస్తానంటూ ప్రముఖ బాక్సర్ విజేందర్ ఇప్పటికే ప్రకటించారు.దిల్లీ సరిహద్దుల్లో రైతులు చేపట్టిన ఆందోళన 11వ రోజుకు చేరింది. చట్టాల రద్దే లక్ష్యంగా ఆందోళన చేపడుతున్న రైతులు కేంద్రం వినతులను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో ఆందోళన ఉద్ధృతం చేయాలని నిర్ణయించిన రైతన్నలకు రాజకీయ పార్టీల రూపంలో వెన్నుదన్ను లభించింది. దీంతో 8న బంద్ చేపట్టేందుకు రైతన్నలు సిద్ధమవుతున్నారు. రైతుల ఆందోళనకు తాము సంఘీభావం ప్రకటిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. రైతులకు మద్దతు దేశవ్యాప్తంగా అన్ని జిల్లాలు, రాష్ట్ర రాజధానుల్లో ఆందోళన చేస్తామని ప్రకటించింది. దేశమంతా కొవిడ్-19 ఆందోళనలో ఉన్న వేళ ప్రభుత్వం పారిశ్రామిక వేత్తలు, కార్పొరేట్ మిత్రుల కోసం ఆదరాబాదరగా ఈ చట్టాలను తీసుకొచ్చిందని ఆ పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా విమర్శించారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తలపెట్టిన బంద్‌కు తెరాస సంపూర్ణ మద్దతు తెలుపుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. తెరాస శ్రేణులు ప్రత్యక్షంగా ఈ బంద్‌లో పాల్గొంటారని ఆయన తెలిపారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు న్యాయమైన పోరాటం చేస్తున్నారని కేసీఆర్ వారిని సమర్థించారు. ఈ చట్టాలు రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉన్నందు వల్లే తెరాస వాటిని పార్లమెంటులో వ్యతిరేకించిందని సీఎం గుర్తుచేశారు.రైతుల బంద్‌కు ఆప్ మద్దతు ప్రకటించింది. రైతుల సమ్మెకు దేశ ప్రజలు శాంతియుతంగా సహకరించాలని దిల్లీ ముఖ్యమంత్రి, ఆ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న ఆప్ కార్యకర్తలు ఈ బంద్‌లో పాల్గొంటారని పేర్కొన్నారు. ప్రముఖ నటుడు, మక్కల్‌నీది మయ్యం అధినేత కమల్ హాసన్ కూడా భారత్ బంద్‌కు సంఘీభావం ప్రకటించారు. ఆ పార్టీకి చెందిన 10 మంది ప్రతినిధులు ఆందోళనలో పాల్గొనేందుకు దిల్లీ వెళుతుందని ఆ పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. బంద్‌కు మద్దతుగా తమిళనాట ఆందోళన చేస్తామని డీఎంకే నేత స్టాలిన్ ప్రకటించారు. రైతుల డిమాండ్ సమంజమైనదని పేర్కొన్నారు. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్షాలు ఇప్పటికే రైతుల ఆందోళనకు మద్దతు ప్రకటించాయి. ఇప్పటికే రైతులు తలపెట్టిన ఆందోళనకు 10 ట్రేడ్ యూనియన్లు సంఘీభావం ప్రకటించగా.. బ్యాంక్ యూనియన్లు కూడా ఈ ఆందోళనలో పాల్గొనేందుకు సిద్ధమయ్యాయి.
పవార్ హెచ్చరిక
వ్యవసాయ చట్టాలపై రైతుల ఆందోళన అంశాన్ని వీలైనంత త్వరగా కేంద్రం పరిష్కరించాలని ఎన్సీపీ అధినేత, కేంద్ర వ్యవసాయ శాఖ మాజీ మంత్రి శరద్ పవార్ కేంద్రానికి సూచించారు. లేకుంటే ప్రస్తుతం దేశ రాజధాని వరకు మాత్రమే పరిమితమైన ఈ ఆందోళన దేశ నలుమూలలకూ విస్తరిస్తుందని హెచ్చరించారు. అయితే, చట్టాలను తాము ఏమాత్రం వెనక్కి తీసుకోబోమని కేంద్రం చెబుతోంది. రైతుల అభ్యంతరాల మేరకు సవరణలు చేస్తామే తప్ప.. చట్టాలను పూర్తిగా ఉపసంహరించుకోబోమని ఆ శాఖ సహాయమంత్రి కైలాష్ చౌదరి అన్నారు.