కనీస వేతనం 18వేలు ఇవ్వాలి 

తిరుపతి,ఆగస్ట్‌31  ( జనంసాక్షి  ) :  ఎన్‌డిఎ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని  సిఐటియు జిల్లా ప్రధాన కందారపు మురళి  విమర్శించారు. పెరుగుతన్న ధరలకు అనుగుణంగా వివిధ రకాల
కార్మికులకు నెలకు రూ.18వేలు వేతనమివ్వాలని డిమాండ్‌ చేశారు. ఎన్నోఎళ్లుగా కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ లో పనిచేస్తున్న కార్మికులను రెగ్యులర్‌ చేసి చేసి పనికి తగిన వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆశ, ఐకెపి, మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని కోరారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు తరహాలో, హమాలీ, ఆటో, మోటార్‌ కార్మికులకు విడిగా సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయాలని ప్రతి కార్మికునికీ పింఛను ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.   మోడీ అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ధరలు తగ్గిస్తామని, నల్లధనాన్ని వెనక్కి తీసుకువస్తానని హావిూ ఇచ్చి ఏళ్లు  గడిచినా ఇంతవరకూ ఏదీ అమలు చేయలేదని విమర్శించారు. ప్రభుత్వాల దుర్మార్గపు విధానాలను తిప్పి కొట్టాలని అన్నారు.  కార్మిక చట్టాల సవరణను విరమించుకోవాలని కోరారు. కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అసంఘటితరంగ కార్మికులైన చేపల, రొయ్యల, పట్టుబడి కార్మికులకు, ఫిష్‌ ప్యాకింగ్‌ కార్మికులకు సామాజిక భద్రత చట్టాన్ని అమలు చేయాలని కోరారు. వైద్యం, బీమా సౌకర్యాలను ప్రభుత్వం కల్పించాలన్నారు. పిఎఫ్‌, ఇఎస్‌ఐ, బోనస్‌, సెలవులు వంటి సంక్షేమ చట్టాలను అన్ని ఆక్వా పరిశ్రమల్లో ఖచ్చితంగా అమలు చేయాలన్నారు.