కన్నతల్లి కర్కశత్వానికి చిన్నారి బలి

 

బిల్డింగ్‌పైనుంచి తోసేసి చంపిన తల్లి

బెంగళూరు,ఆగస్ట్‌29(జ‌నంసాక్షి): కన్నతల్లి కర్కశత్వానికి ఓ చిన్నారి బలయ్యింది. అతి రకిరాతకంగా కూతరుని కూడా చూడకుండా భవనంపై నుంచి తోసేయడం ద్వారా ఆమె ఉసురు తీసింది. ఒకసారి కాదు రెండు సార్లు ఆ పాపను మేడపై నుంచి కిందికి తోసేసి ప్రాణాలు తీసింది. ఈ సంఘటన బెంగళూరులోని జేపీ నగర్‌లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. జేపీ నగర్‌లో నివాసముంటున్న స్వాతి సర్కార్‌ తన ఏడేళ్ల కూతురి అల్లరి, మొండిపట్టుదల భరించలేక భవనం పైనుంచి కిందికి తోసేసింది. అప్పటికి పాప శ్వాస తీసుకుంటుండటంతో పైకి తీసుకువచ్చి మరోసారి కిందికి తోసేసింది. దీంతో ఆ చిన్నారి ప్రాణాలు కొల్పోయింది. ఈ సంఘటనతో ఆగ్రహం చెందిన స్థానికులు ఆమెను విద్యుత్‌ స్తంభానికి కట్టేసి కోట్టారు. సమాచారమందుకున్న పోలీసులు ఆమెను విడిపించి పోలీసు స్టేషన్‌కు తరలించారు. పశ్చిమబెంగాల్‌కు చెందిన స్వాతి సర్కార్‌ కుటుంబం బెంగళూరుకు వలస వచ్చింది. ఆమె ఏడు నెలల నుంచి తన భర్తతో దూరంగా ఉంటోంది. భర్త కాంచన్‌ సర్కార్‌ ప్రముఖ ఐటీ కంపెనీలో బిజినెస్‌ అనలిస్టుగా పని చేస్తుండగా, అతని భార్య స్వాతి సర్కార్‌ ఓ పాఠశాలలో హిందీ టీచరుగా పని చేసేది. అయితే గత కొద్ది కాలంగా ఆమె మానసిక ప్రవర్తన సరిగా లేకపోవడంతో ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉంటోంది. భార్యతో మనస్పర్థలు కారణంగా ఆమె భర్త ఒంటరిగా ఇందిరా నగర్‌లో నివాసం ఉంటున్నాడు. ఎప్పుడో ఒకసారి ఇంటికి వస్తుండేవాడు. దీంతో స్వాతి సర్కార్‌ రోజురోజుకు మితివిూరి ప్రవర్తించసాగేది. ఈ నేపథ్యంలో ఆమె ఆదివారం సాయంత్రం 3.30 గంటలకు ఇంట్లోనున్న ఏడేళ్ల కుమార్తె శ్రేయాను మూడో అంతస్తుపై నుంచి కిందకు తోసేసింది. అయితే శ్రేయ మూగ బాలిక కావడంతో కేకలు వేయలేకపోయింది. ఈ ఘటనలో గాయపడిన చిన్నారిని మరోసారి పైకి తీసుకు వెళ్లి కిందకు పడేసింది. అంత ఎత్తు నుంచి పడిపోయిన ఆ చిన్నారి అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది. తరువాత ఏం తెలియనట్లు స్వాతి సర్కార్‌ ఇంట్లోకి వెళ్లి మేకప్‌ వేసుకొని ముస్తాబై బయటకు రావడం గమనార్హం. ఒకవైపు కూతురి మృతదేహం ఉన్నా మరోవైపు పట్టించుకోకుండా వెళ్లిపోతున్న తల్లిని స్థానికులు అడ్డుకుని ప్రశ్నించగా, నా కూతురిని నా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటానంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పింది. ఆగ్రహానికి గురైన స్థానికులు ఆమెకు దేహశుద్ది చేసి కరెంటు స్తంభానికి కట్టేసి పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకొని నిందితురాలిని అరెస్ట్‌ చేసిన పుట్టెనహళ్లి పోలీసులు కుటుంబ కలహాలతోనే శ్రేయను హత్య చేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

—————