కన్నుల పండుగగా క్రీడా పురస్కారాలు

న్యూఢిల్లీ,ఆగష్టు 29(జనంసాక్షి): జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఢిల్లీ రాష్ట్రపతి భవన్‌ లో క్రీడా అవార్డుల ప్రదానం ఘనంగా జరిగింది. భారత హాకీ దిగ్గజం ధ్యాన్‌ చంద్‌ జయంతిని పురస్కరించుకుని మంగళవారం రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్‌ అత్యుత్తమ క్రీడాకారులను అవార్డును ప్రదానం చేశారు. క్రీడల్లో అత్యున్నత పురస్కారం రాజీవ్‌ ఖేల్‌రత్నను హాకీ టీమ్‌ మాజీ కెప్టెన్‌ సర్దార్‌ సింగ్‌, పారాలింపియన్‌ దేవేంద్ర జజరియా అందుకున్నారు. ఈ అవార్డు అందుకున్న తొలి పారా అథ్లెట్‌ గా దేవేంద్ర నిలిచాడు. ఈ సందర్భంగా ఖేల్‌ రత్న పురస్కారాన్ని అందుకోవడంపై గ్రహీతలు సంతోషం వ్యక్తం చేశారు. ఇక అర్జున అవార్డులను 17 మంది క్రీడాకారులు రాష్ట్రపతి చేతుల విూదుగా అందుకున్నారు. చటేశ్వర్‌ పుజారా(క్రికెట్‌), దేవేంద్రో సింగ్‌(బాక్సింగ్‌), హర్మన్‌ప్రీత్‌ కౌర్‌(క్రికెట్‌), జ్యోతి సురేఖ వెన్నం(ఆర్చరీ), కుశ్‌బీర్‌ కౌర్‌(అథ్లెటిక్స్‌), బెంబెమ్‌ దేవి(ఫుట్‌బాల్‌), ప్రకాశ్‌ నంజప్ప(షూటింగ్‌), ప్రశాంతి సింగ్‌(బాస్కెట్‌ బాల్‌), రాజీవ్‌ అరోకియా(అథ్లెటిక్స్‌), సాకేత్‌ మైనేని(టెన్నిస్‌), సత్యవర్ద్‌ కడియన్‌(రెజ్లింగ్‌), శివ్‌ చర్వాసియా, ఎస్వీ సునీల్‌(హాకీ), తంగవేలు మరియప్పన్‌(అథ్లెటిక్స్‌), వరుణ్‌ సింగ్‌ భాటి(పారా అథ్లెట్‌), ఎస్‌ఎస్‌పీ ఛర్వాసియా(గోల్ఫ్‌), జస్వీర్‌ సింగ్‌(కబడ్డీ), పీఎన్‌ ప్రకాశ్‌(షూటింగ్‌), అమల్‌రాజ్‌(టేబుల్‌ టెన్నిస్‌) అర్జున అవార్డులు దక్కిన వారిలో ఉన్నారు. ఈసారి నలుగురికి ద్రోణాచార్య అవార్డులు లభించాయి. దివంగత డాక్టర్‌ ఆర్‌ గాంధీ(అథ్లెటిక్స్‌), జీఎస్‌ఎస్‌వీ ప్రసాద్‌(బ్యాడ్మింటన్‌), బ్రిజ్‌ భూషణ్‌ మహంతి(బాక్సింగ్‌), రోషన్‌ లాల్‌(రెజ్లింగ్‌), సంజోయ్‌ చక్రవర్తి(షూటింగ్‌) ద్రోణాచార్య అవార్డు అందుకున్నారు. ధ్యాన్‌చంద్‌ అవార్డు గ్రహీతల్లో భూపేందర్‌ సింగ్‌(అథ్లెటిక్స్‌), ఎస్‌ఎస్‌ హకీమ్‌(ఫుట్‌బాల్‌), సుమ్‌రాయ్‌ తెతె(హాకీ).ఖేల్‌ ప్రోత్సాహ్‌ అవార్డును రిలయన్స్‌ ఫౌండేషన్‌ యూత్‌ స్పోర్ట్స్‌ గెలుచుకుంది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతులవిూదుగా నీతా అంబానీ ఈ అవార్డును అందుకున్నారు.