కన్నుల పండువగా లష్కర్ బోనాలు
లష్కర్ బోనమెత్తింది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేయడంతో లష్కర్ అంతా పండగ వాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సమేతంగా బోనాల వేడుకల్లో పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు, బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని సీఎం కేసీఆర్ అమ్మవారికి మొక్కుకున్నారు. అటు మండలి చైర్మన్ స్వామిగౌడ్, స్పీకర్ మధుసూదనాచారి, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ సంతోష్ కుమార్, మేయర్ బొంతు రామ్మోహన్ కూడా అమ్మవారిని దర్శించుకున్నారు.
ఈసారి లష్కర్ బోనాల వేడుక మరో ప్రత్యేకతను సంతరించుకుంది. అమ్మవారికి సమర్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బంగారు బోనాన్ని తయారుచేసింది. ఎంపీ కవిత బంగారు బోనాన్ని ఎత్తుకుని ఆదయ్య నగర్ నుంచి మహంకాళి అమ్మవారి ఆలయానికి భారీ ర్యాలీగా చేరుకున్నారు. ఎంపీ కవిత వెంట ఒక వెయ్యి ఎనిమిది మంది బోనాలతో తరలివచ్చారు. బంగారు బోనాన్ని 3 కిలోల 80 గ్రాముల మేలిమి బంగారంతో తయారు చేశారు. ఉజ్జయినీ మహంకాళి, మాణిక్యాలమ్మ ప్రతిమలతో పాటు 285 వజ్రాలతో బోనాన్ని అలంకరించారు. ఎంపీ కవిత బంగారు బోనాన్ని అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
తెలంగాణ వచ్చిన తర్వాతే మన పండగలకు గుర్తింపు వచ్చిందన్నారు ఎంపీ కవిత. బోనాల పండగను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోందని చెప్పారు. వర్షాలు బాగా కురిసి.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారికి మొక్కుకున్నట్టు తెలిపారు. తెలంగాణ ఆడబిడ్డలందరికీ ఎంపీ కవిత బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
అటు లష్కర్ బోనాలకు భక్తులు పోటెత్తారు. సికింద్రాబాద్ నుంచే కాకుండా హైదరాబాద్ నుంచి కూడా భారీగా తరలివచ్చారు. ఆడబిడ్డలు బోనాలను నెత్తికొత్తుకొని అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆలయ నిర్వాహకులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. శివసత్తుల పూనకాలు, పోతురాజుల వీరంగాలతో లష్కర్ అంతా శిగమూగుతోంది.