కమలా హారిస్‌.. డొనాల్డ్‌ ట్రంప్‌.. ఎవరు గెలిస్తే భారత్‌కు మేలు?

వాషింగ్టన్‌: అమెరికా స్వాతంత్య్ర పోరాటంలో కీలక పాత్ర పోషించిన పెన్సిల్వేనియా ప్రస్తుతం జరుగుతున్న అధ్యక్ష ఎన్నికల్లోనూ అత్యంత కీలకంగా మారింది.

అధ్యక్షులుగా ఎన్నిక కావాలంటే ఈ రాష్ట్రంలో తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. డొనాల్డ్‌ ట్రంప్, కమలా హారిస్‌ మధ్య ఈ రాష్ట్రంలో ఉత్కంఠ భరిత పోరు సాగుతోంది. పెన్సిల్వేనియాలో 19 ఎలక్టోరల్‌ కాలేజ్‌ ఓట్లున్నాయి. అత్యధికంగా కాలిఫోర్నియాలో 54 ఓట్లున్నాయి. ఇది డెమోక్రాట్లకు కంచుకోట. రిపబ్లికన్లు బలంగా ఉన్న టెక్సాస్‌లో 40 ఓట్లున్నాయి.

  • దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో గతంలో అధ్యక్ష అభ్యర్థులకు వచ్చిన ఓట్ల ఆధారంగా ట్రంప్, హారిస్‌లకు వచ్చే ఓట్లను రాజకీయ నిపుణులు అంచనా వేశారు.
  • ఏడు కీలక రాష్ట్రాల్లోని ఓట్లపైనే ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఇందులో ఆరిజోనా (11), విస్కాన్సిన్‌ (10), మిషిగన్‌ (15), పెన్సిల్వేనియా (19), జార్జియా (16), నార్త్‌ కరోలినా (16) ఉన్నాయి.
  • వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇద్దరు అభ్యర్థులు పెన్సిల్వేనియాపై దృష్టి సారించారు. ఇక్కడ తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది.
  • ఓటర్లను ఆకట్టుకునేందుకు ట్రంప్, హారిస్‌కు సంబంధించిన వేల మంది వాలంటీర్లు పెన్సిల్వేనియాలో మకాం వేశారు.
  • పెన్సిల్వేనియాలో గెలవకుండా 270 ఎలక్టోరల్‌ ఓట్లు సాధించడం అసాధ్యమని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.
  • 270టువిన్‌.కామ్‌ వెబ్‌సైట్‌ అంచనా ప్రకారం.. హారిస్‌కు 226 ఓట్లు, ట్రంప్‌నకు 219 ఓట్లు రావొచ్చని అంచనా.
  • 2016 ఎన్నికల్లో ట్రంప్‌ కేవలం 1శాతం ఓట్లతో పెన్సిల్వేనియాలో విజయం సాధించారు. అదే 1 శాతం ఓట్ల తేడాతో 2020లో ఈ రాష్ట్రాన్ని కోల్పోయారు.
  • 2024 ఎన్నికల్లో నువ్వానేనా అన్నట్లు ఈ రాష్ట్రం ఉంది. దాదాపుగా టాస్‌ వేసినట్లుగానే ఫలితం ఉండవచ్చని అంటున్నారు.
  • కీలక రాష్ట్రం కావడంతో ట్రంప్, హారిస్‌లు.. డబ్బు, సమయం, శక్తినంతా ఇక్కడే ధారపోస్తున్నారు. వాణిజ్య ప్రకటనలూ ఇక్కడే ఎక్కువగా ఇస్తున్నారు.
  • పెన్సిల్వేనియా ఓటర్లను ఆకట్టుకోవడానికి సోమవారం నుంచి 21 మంది ప్రముఖులతో రిపబ్లికన్‌ పార్టీ బస్సు యాత్ర ప్రారంభించింది. ఇందులో భారతీయ అమెరికన్‌ కాష్‌ పటేల్‌ ఉన్నారు.
  • రెండు పార్టీలకు చెందిన దాదాపు 50 సభలు గత 3 నెలల్లో పెన్సిల్వేనియాలో జరిగాయంటేనే ఇక్కడ పోటీ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
  • ప్రతి 4 డాలర్లలో 1 డాలరును ఈ రాష్ట్రంలోనే ప్రకటనల కోసం రెండు పార్టీలు ఖర్చు చేశాయి.
  • ట్రంప్‌ ఇటీవల మెక్‌ డొనాల్డ్‌లో అక్కడి సిబ్బందిలా దుస్తులు వేసుకుని పని చేసింది ఈ రాష్ట్రంలోనే కావడం విశేషం.