కమల్‌ తొలి అడుగు.. 

– ప్రజల కోసం మొబైల్‌ యాప్‌
– ప్రజల సమస్యలు తెలుసుకోవటానికి ఇది చక్కటి వేదిక
– అవినీతికి వ్యతిరేఖంగా ప్రజలు గొంతెత్తాలి
– పార్టీ ప్రకటనకు కసరత్తు చేయాల్సి ఉంది
– విలేకరుల సమావేశంలో కమల్‌హాసన్‌ వెల్లడి
చెన్నై, నవంబర్‌7(జ‌నంసాక్షి) : కమల్‌హాసన్‌ రాజకీయాల్లోకి వస్తున్నారనే విషయం ఇప్పటికే ఖరారైంది. తాను కొత్త పార్టీతోనే రాజకీయ రంగ ప్రవేశం చేస్తానని ఇటీవల కమల్‌ స్వయంగా చెప్పారు. పార్టీకి నిధుల కేటాయింపు విషయంలో అభిమానులు తన అండగా ఉంటారని భావిస్తున్నట్లు కూడా తెలిపారు. దీంతో మంగళవారం తన 63వ పుట్టినరోజు సందర్భంగా కమల్‌ కచ్చితంగా పార్టీని ప్రకటిస్తారని అందరూ అనుకున్నారు. కానీ తాను పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడంలేదని అటు అభిమానులకు, ఇటు తమిళ ప్రజలకు కమల్‌ షాకిచ్చారు. అయితే పాత్రికేయ సమావేశం మాత్రం నిర్వహించారు. చెన్నైలోని జీఆర్‌టీ కన్వెన్షన్‌ సెంటర్‌లో మంగళవారం మధ్యాహ్నం జరిగిన ప్రెస్‌ విూట్‌లో కమల్‌ హాసన్‌ ఒక మొబైల్‌ యాప్‌ను ప్రారంభించారు. ‘మియామ్‌ విజిల్‌’ పేరిట ప్రారంభించిన ఇది కేవలం యాప్‌ మాత్రమే కాదని, ప్రజలు తమ సమస్యలను తెలియజేయడానికి ఒక చక్కటి వేదిక అని చెప్పారు. ప్రజలంతా ఒకరితో ఒకరు అనుసంధానమై ఉండటానికి ఇదొక ప్లాట్‌పాం అని వెల్లడించారు. ప్రజలతో కలసి పనిచేయడమే తన ఉద్దేశమని, అభిమానుల ప్రోత్సహంతోనే సమాజసేవకు సిద్ధమయ్యానని చెప్పారు. ఈయాప్‌ ఒక విజిల్‌ బ్లోవర్‌ ప్లాట్‌ఫాంలా పనిచేస్తుందని, ఎక్కడైనా అన్యాయం జరిగితే ఈ యాప్‌ ద్వారా తెలియజేయొచ్చునని కమల్‌ సూచించారు. తద్వారా న్యాయం జరిగేలా చూడొచ్చునని తెలిపారు. అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు గొంతెత్తాలిని కమల్‌ పిలుపునిచ్చారు. ప్రజలతో మమేకమై, వారి సమస్యలు తెలుసుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాలని అనుకుంటున్నానని కమల్‌ పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం ఏం తప్పుచేస్తుందనే విషయాన్ని కాలమే నిర్ణయిస్తుందన్నారు. నేను ఈరోజు రాజకీయ పార్టీని ప్రకటిస్తానని చాలా వార్తలే వచ్చాయని, కానీ నేనింకా చాలా కసరత్తు చేయాల్సిఉందని కమల్‌ స్పష్టం చేశారు. అభిమానులతో కూర్చొని, పూర్తిగా విశ్లేషించి నిర్ణయం తీసకుంటాను’ అని కమల్‌ వెల్లడించారు. కాగా మియామ్‌ విజిల్‌ యాప్‌ కోసం 20 నుంచి 25 మంది పనిచేస్తున్నారని, ప్రస్తుతం బీటా వర్షన్‌ను పరీక్షిస్తున్నామని కమల్‌ చెప్పారు. తన టీంను జనవరిలో ప్రకటిస్తానని కమల్‌ పేర్కొన్నారు.