కరీంనగర్ నుంచే టిఆర్‌ఎస్ ఎన్నికల శంఖారావం
మార్చి1న తొలి బహిరంగ సభకు ఏర్పాట్లు
ఏ క్షణంలో అయినా వెలువడనున్న నోటిఫికేషన్
కరీంనగర్,ఫిబ్రవరి24(జనంసాక్షి): రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలపై టీఆర్‌ఎస్ పార్టీ దృష్టి సారించింది. ఇప్పటికే కసరత్తు చేపట్టిన సిఎం కెసిఆర్, వర్కింగ్ ప్రసిడెంట్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. వచ్చే నెలలో ఎన్నికల షెడ్యూలు విడుదల కానున్నందున ప్రత్యేక దృష్టి సారించారు. ఈ ఎన్నికల్లో 16 సీట్లు గెలవడమే లక్ష్యంగా ముందుకు సాగాలని నిర్ణయించారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఎప్పుడైనా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తున్నది. దీనిని పరిగణలోకి తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్లమెంట్ ఎలక్షన్లపై దృష్టి సారించారు.గతంలో మాదిరిగానే కరీంనగర్ నుంచే తొలి శంఖారావ సభ ఉంటుందని భావిస్తున్నారు. ఇందులో భాగంగా మార్చి1న కరీంనగర్‌లో సభకు సన్నాహాలు చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇందుకు అనుగుణంగా సిద్దం అవుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే నాటికే అన్ని లోక్‌సభ నియోజకవర్గాల్లో బహిరంగ సభలను నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో మొదటి సభను కరీంనగర్ నుంచే ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. మార్చి ఒకటిన ఉదయం పది గంటలకు ఎస్సారార్ కళాశాల మైదానంలో జరిపేందుకు నిర్ణయించినట్లుగా కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు. నిజానికి కొద్ది రోజుల క్రితం సిరిసిల్లలో జరిగిన ఒక సమావేశంలో కరీంనగర్ లోకసభ అభ్యర్థిగా ప్రస్తుత ఎంపీ వినోద్‌కుమారే పోటీ చేస్తారని ప్రకటించారు. కరీంనగర్‌లో తొలి సమావేశం నిర్వహించడానికి ఇది కూడా ఒక కారణమని భావిస్తున్నారు. సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి, కరీంనగర్, మానకొండూరు, హుస్నాబాద్, హుజురాబాద్ నియోజకవర్గాల ప్రజలు సభకు హాజరుకానున్నారు. మార్చి ఒకటిన నిర్వహించే సభకు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు హాజరవుతారని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు. సభ నిర్వహణకు ఎస్సారార్ కళాశాల మైదానాన్ని బుక్ చేశామనీ, ఉదయం 10 గంటలకు బహిరంగ సభ ప్రారంభమవుతుందని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 17 లోకసభ నియోజకవర్గాలుండగా, 16 స్థానాల్లో టీఆర్‌ఎస్ జెండా ఎగరేసి తీరుతామని పలుసార్లు ప్రకటించారు. ఆ మేరకు కార్యాచరణ పక్రియను ఆరంభించారు. ఇప్పటికే పార్టీశ్రేణులను కూడా ఆ దిశగా సన్నద్ధం చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించిన విధానాన్నే ఈ ఎన్నికల్లోనూ అనుసరించే దిశగా అడుగులు వేస్తున్నారు. అసెంబ్లీతో పాటు పంచాయతీ ఎన్నికల్లోనూ గులాబీ హవా సాగింది. టీఆర్‌ఎస్ అనుసరిస్తున్న విధానాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను నిశితంగా పరిశీలిస్తున్న ప్రజానీకం అన్నింటా అండగా నిలుస్తున్నది. ఈ నేపథ్యంలో లోకసభ ఎన్నికల్లోనూ అన్ని స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులే విజయఢంకా మోగిస్తారన్న ధీమా పార్టీలో స్పష్టంగా కనిపిస్తున్నది. ముఖ్యమంత్రికి కేసీఆర్‌కు ఆది నుంచీ ఉమ్మడి కరీంనగర్ గడ్డ సెంటిమెంట్‌గా కలిసి వస్తున్నది. ఇక్కడ ఏ కార్యక్రమం చేపట్టినా విజయం కలుగుతుందన్న నమ్మకం సీఎం కెసిఆర్‌కు ఉన్నది. అందుకే నాటి 2014 అసెంబ్లీ ఎన్నికలు, అంతకుముందు సమైక్య రాష్ట్రంలో జరిగిన అనేక ఎన్నికలకు ముందస్తు సభలను కరీంనగర్ వేదికగానే నిర్వహించారు. అదే సెంటిమెంట్‌తో 2019 ఎన్నికల తొలి ప్రచార సభను కూడా ఉమ్మడి జిల్లాలోని హుస్నాబాద్‌లో ఏర్పాటు చేశారు. ఆ మేరకు రాష్ట్రంలో అన్ని సభలూ విజయవంతం కావడమే కాదు, అత్యధిక సీట్లు సాధించి మరోసారి అధికారంలోకి వచ్చారు. ఈ సెంటిమెంట్‌ను మరోసారి కొనసాగించబోతున్నారు.