కరువు కోరలు విరిచేద్దాం వలసలు నిలువరిద్దాం
– మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రాజెక్టులు నిర్మిద్దాం
హైదరాబాద్,జులై20(జనంసాక్షి):మహబూబ్ నగర్ జిల్లా లో వలసల నివారణకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని ఇందుకు గాను జిల్లాలో ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నట్లు
మంత్రి హరీష్ రావు అన్నారు.సోమవారం నాడు మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన పలువురు టీడీపీ, కాంగ్రెస్ నాయకులు.. వందలాది మంది కార్యకర్తలతో కలిసి టిఆర్‌ఎస్ లో చేరారు. హైదరాబాద్ తెలంగాణ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు హరీష్‌రావు, జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు నిరంజన్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.పాలమూరు ఎత్తిపోతలతో కొడంగల్ నియోజకవర్గానికి లక్షా 8 వేల ఎకరాలకు నీరొస్తదని మంత్రి హరీష్‌రావు చెప్పారు. సీఎం కేసీఆర్ పట్టుబడ్తే అనుకున్నది సాధిస్తారని ఆయన స్పష్టం చేశారు. గత నాయకులు కవిూషన్ల కోసం ప్రాజెక్టులు మొదలుపెట్టిన్రని, సీఎం కేసీఆర్ రైతుల పొలాలకు నీళ్లు మళ్లించేందుకు కడుతున్నారని వివరించారు. కృష్ణానది అత్యధికంగా పారేది పాలమూరు జిల్లాలోనేనని, తలాపున కృష్ణమ్మ పరుగులు తీస్తున్న సాగు, తాగునీరు లేక అల్లాడుతున్నారని అన్నారు. కృష్ణా నీళ్లు తెస్తేనే పాలమూరు గోస తీరుతదని సీఎం కేసీఆర్ పాలమూరు ఎత్తిపోతలను తీసుకొస్తున్నారని మంత్రి హరీష్‌రావు వివరించారు.గత పాలకుల హయాంలో 24 గంటల కరెంట్ ఎప్పుడూ లేదని, సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రతి పల్లెకు 24 గంటల కరెంట్ ఇస్తున్నామని మంత్రి హరీష్‌రావు చెప్పారు. వారం రోజుల్లోనే పాలమూరు ఎత్తిపోతల భూ సేకరణకు నోటిఫికేషన్ ఇస్తామన్నారు. యుద్ధ ప్రాతిపదికన పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేస్తామని మంత్రి హావిూ ఇచ్చారు. బంగారు తెలంగాణ కోసం అందరం కలిసికట్టుగా కృషిచేద్దామని హరీష్‌రావు చెప్పారు.రంజాన్ సందర్భంగా ప్రభుత్వం తరపున ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇవ్వడం దేశంలోనే మొదటిసారి అని మంత్రి చెప్పారు. పండుగ సందర్భంగా పేద ముస్లింలకు కొత్త బట్టలు పంపిణీ చేసిన ఘనత సీఎం కేసీఆర్ దే అన్నారు. పేద ముస్లిం యువతుల పెళ్లికి 51 వేల రూపాయలు ఇస్తున్నదని మంత్రి గుర్తుచేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతి అడుగూ పేద ప్రజల కోసమే వేస్తోందని చెప్పారు. బియ్యం కోటా పెంచిన ఘనత సీఎం కేసీఆర్ దన్నారు. పేదల కోసం సర్కారు రూ.24 వేల కోట్లు ఖర్చు పెడుతోందని హరీష్‌రావు వివరించారు.పాలమూరు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ కృషిచేస్తున్నారని మంత్రి హరీష్‌రావు చెప్పారు. ఎవరికి ఏ ఆపదొచ్చినా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ మునిగిపోయిన నావ అని ఆయన విమర్శించారు. మహబూబ్ నగర్ కు రావాల్సిన నీళ్లు అనంతపురం తీసుకుపోతుంటే జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకురాలు డీకే అరుణ హారతి పట్టిందని హరీష్‌రావు నిప్పులు చెరిగారు.
పాలమూరు ప్రాజెక్టు వద్దంటున్న టీడీపీని భూస్థాపితం చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి కోరారు. కొడంగల్ నియోజకవర్గ ప్రజలు టీడీపీ మూలాలు పెకిలించి బయటికి రావాలన్నారు.మహబూబ్ నగర్ జిల్లాపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ద పెట్టారని మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారు. పాలమూరు జిల్లాకు నీళ్లు అందించాలని సీఎం కేసీఆర్ కృషిచేస్తున్నారని ఆయన తెలిపారు. పాలమూరు ఎత్తిపోతల ద్వారా కొడంగల్ తాలూకా ఎక్కువ లాభపడుతుందన్నారు. జిల్లా ప్రజలకు నీరందించే పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఆపాలని చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నాడని మంత్రి లక్ష్మారెడ్డి విమర్శించారు. పాలమూరు ఎత్తిపోతలను అడ్డుకుంటున్న చంద్రబాబుకు తెలంగాణ టీడీపీ నేతలు వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు. పాలమూరు ఎత్తిపోతల పూర్తయితేనే మన భవిష్యత్తు బాగుంటదని లక్ష్మారెడ్డి చెప్పారు.పాలమూరు ఎంపీగానే కేసీఆర్ తెలంగాణ సాధించారని మంత్రి జూపల్లి గుర్తుచేశారు. ఇంటింటికి నీళ్లివ్వకపోతే ఓట్లు అడగను అని చెప్పిన దమ్మున్న నాయకుడు సీఎం కేసీఆర్ అని చెప్పారు. పాలమూరు ప్రజల తలరాతలు మార్చేందుకు సీఎం కేసీఆర్ కంకణం కట్టుకున్నారని మంత్రి వివరించారు. టీ టీడీపీ నేతలు తెలంగాణ తిండి తింటూ సిగ్గులేకుండా ఆంధ్రా పాట పాడుతున్నారని జూపల్లి నిప్పులు చెరిగారు.రేవంత్ రెడ్డిని పరామర్శించేందుకు ఆంధ్రా నుంచి కొన్ని వేల మంది వచ్చిన్రని మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి చెప్పారు. రేవంత్ రెడ్డి కొడంగల్ కు చెడ్డపేరు తెచ్చిండని మండిపడ్డారు. అందరం కలిసి బంగారు తెలంగాణ కోసం కృషిచేద్దామన్నారు.పాలమూరు ఎత్తిపోతలతో జిల్లా రూపురేఖలే మారిపోతాయని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస గౌడ్ అన్నారు. పాలమూరు జిల్లాలోని చీడపురుగులను ఏరివేసి ప్రగతి పథంలో నడుద్దామని ప్రజలకు సూచించారు.