కరువొచ్చింది కదలాలి
– వడదెబ్బ బాధితులకు ఆపద్భంధు కింద పరిహారం
– కలెక్టర్ల కాన్ఫరెన్సులో సీఎం కేసీఆర్ దిశానిర్ధేశం
హైదరాబాద్,ఏప్రిల్ 29(జనంసాక్షి): తెలంగాణలో ఏ ప్రాంతంలో అయినా తిండి లేక ప్రజలు బాధపడుతుంటే ,వెంటనే అదికారులు స్పందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పారు. కరువు సమస్యపై చర్చించి, తగు చర్యలు తీసుకోవడానికి గాను జిల్లా కలెక్టర్‌ల సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. కరువు , వడగాడ్పులు,ఎండ వేడి ,భూగర్భజలాల మట్టం పడిపోవడం వంటి సమస్యలను దృష్టిలో ఉంచుకుని అన్ని ప్రాంతాలలో చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. మద్యాహ్నపు వేళ ఉపాధి హావిూ పనులు చేయించవద్దని, ఉదయంసాయంత్రం వేళల్లో పనులు చేయించాలని సిఎం సూచించారు. మంచినీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలన్నారు. పశుగ్రాసం ఎక్కడ ఎంత అవసరమో అంచనా వేసి అందుబాటులో ఉంచాలని కెసిఆర్ చెప్పారు. ఈ ఏడాది వర్షాలు బాగా కురిసే అవకాశం ఉన్నందున, వ్యవసాయ పనులకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కూడా కలెక్టర్‌లను కోరారు. రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర కరవును ఎదుర్కొనేందుకు ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలను సీఎం శుక్రవారం సవిూక్షించారు. తీవ్రరూపం దాల్చిన తాగునీటి ఎద్దడి, పశుగ్రాసం కొరత, వలసలు, వడగాల్పుల ప్రభావం, రైతులను ఆదుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలు ఇలా మొత్తం ఏడు అంశాలపై జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం చర్చించారు. వడగాల్పులు, ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, వ్యవసాయం, తాగునీరు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, పశు సంవర్థక శాఖల గురించి కలెక్టర్లతో సవిూక్షించి కార్యాచరణను రూపొందించారు. రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. సాధారణం కన్నా ఐదారు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడగాల్పుల తీవ్రతతో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్ర వ్యాప్తంగా 279 మంది వడగాల్పులకు చనిపోయినట్లు జిల్లా కలెక్టర్లు ప్రాథమికంగా నివేదించారు. ఇందులో 248 మరణాలను పరిశీలించిన త్రిసభ్య కమిటీ 137 మంది వడగాల్పుల వల్ల మరణించినట్లు నిర్థారించారు. 85 మందికి పరిహారం పొందడానికి అర్హత ఉందని నివేదించారు. అయితే, ఇప్పటివరకు ఒక్క కుటుంబానికి కూడా పరిహారం అందలేదు. దీంతో ఆపద్బంధు కింద సాయం అందించాలని సూచించారు. దీనికి 65 ఏళ్ల నిబంధన తొలగించాలన్నారు. ఎండలు మరో నెల వరకు ఇదేవిధంగా ఉంటాయికనుక అందుకు తగ్గట్లుగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం వడదెబ్బ మృతుల కుటుంబాలకు రూ.50వేల చొప్పున ఆర్థికసాయం అందించే వీలుంది.
తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. వందల గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. వ్యవసాయ బోర్లను తీసుకొని తాగునీటికి వినియోగిస్తున్నారు. సమస్య తీవ్రత, భూగర్భజల మట్టం పదేళ్లలో ఎప్పుడూ లేనంతగా పడిపోయిన నేపథ్యంలో తాగునీటి సరఫరాకు మెరుగుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. మిషన్‌కాకతీయ, మిషన్‌భగీరథ పనుల పురోగతి, పూర్తి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేకంగా చర్చించారు. ఇవి పూర్తయితే భూగర్భ జలాలు పెరుగతాయని, మంచినీటి కొరత తీరుతుందని అన్నారు. సవిూక్షలో సిఎస్ రాజీవ్ శర్మ మంత్రులు పోచారం, జోగు రామన్న,తలసాని తదితరులు పాల్గోన్నారు.




