కరోనాతో మెదడుపై తీవ్ర ప్రభావం
న్యూఢిల్లీ,నవంబర్12(జనంసాక్షి): కరోనా వైరస్ బారిన పడి కోలుకున్న వ్యక్తుల్లో కొన్ని రకాల కొత్త సమస్యలు కనిపిస్తున్నాయి. వైరస్ మనిషి మెదడుపై కూడా ప్రభావం చూపుతున్నట్టు ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు చెప్తున్నారు. ఈ వైరస్ మెదడుపై ప్రభావం చూపడంతో నిద్రలేమి, మనోవ్యధ, కుంగుబాటు, ఒత్తిళ్లు, ఆదుర్దా, ఆందోళన వంటి మానసిక రోగాలకు గురవుతున్నారని పరిశోధనలో తేలింది. వైరస్ సోకిన 20శాతం కంటే ఎక్కువ మందిలో 90 రోజుల్లోపే మానసిక ఒత్తిళ్లతో ఇబ్బందులు పడుతున్నారని పరిశోధకులు చెప్తున్నారు. మానసిక ఒత్తిళ్లకు లోనైన వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలని, తగిన చికిత్స తీసుకోవాలని పరిశోధకులు చెప్తున్నారు. మానసిక ఒత్తిళ్లు, కుంగుబాటుతో ఇబ్బందిపడే వారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి వీరికి వైరస్ సోకే ప్రమాదం అధికంగాఉంటుందని, జాగ్రత్తగా ఉండాలని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.