కరోనా కట్టడికి ఇంకా ఆరు నెలలు – ఏయిమ్స్‌

 

దిల్లీ,డిసెంబరు 17 (జనంసాక్షి):భారత్‌లో తగిన సంఖ్యలో ప్రజలు వ్యాక్సిన్‌ పొందేందుకు సుమారు ఆరు నెలల సమయం పడుతుందని, అదేవిధంగా కరోనా వైరస్‌ వ్యాప్తి గొలుసుకట్టును తెంచేందుకు అంతే సమయం పట్టవచ్చని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణదీప్‌ గులేరియా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో వెల్లడించారు. దేశంలో కొవిడ్‌-19 కేసుల సంఖ్య 99 లక్షలకు, మరణాలు లక్షా 44 వేలకు పైబడిన నేపథ్యంలో.. ఆయన ప్రకటన ఊరట కలిగిస్తోంది.రానున్న ఆరునెలల్లో కొవిడ్‌ సోకిన వారిలో పలువురు కుదుటపడి రోగనిరోధకతను పొందుతారు.. మరి కొందరికి వ్యాక్సిన్‌ ద్వారా ఆ శక్తి లభిస్తుందని ఆయన వివరించారు. ఈ రెండింటి ఫలితంగా కొవిడ్‌ గొలుసుకట్టు వ్యాప్తిని అడ్డుకోవచ్చని అభిప్రాయపడ్డారు. కరోనా హాని అధికంగా ఉన్న వర్గానికి తొలుత వ్యాక్సిన్‌ అందచేస్తామని.. తద్వారా కరోనా మరణాల సంఖ్య దానంతట అదే తగ్గుముఖం పడుతుందని ఎయిమ్స్‌ చీఫ్‌ విశ్లేషించారు.కరోనా టీకా అందించాల్సిన వారు ప్రాథమికంగా 30 కోట్ల మంది కాగా.. వారికి రెండేసి డోసుల చొప్పున 60 కోట్ల డోసులు అవసరమవుతాయని రణదీప్‌ గులేరియా అంచనా వేశారు. తొలివరుస కరోనా యోధులు, వైద్యారోగ్య సిబ్బంది, 50 ఏళ్లు పైబడిన వారు, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి కొవిడ్‌ టీకాను అందచేస్తామన్నారు. ఈ ప్రక్రియకు నాలుగు నుంచి ఆరునెలలు పడుతుందన్నారు. ఈ లక్ష్యం సాధించేందుకు టీకా డోసుల లభ్యత.. వాటిని ప్రజలకు పంపిణీ చేయటమే కీలకమని ఆయన వివరించారు.కాగా దేశంలో అత్యవసర వినియోగానికి మూడు కొవిడ్‌ టీకాలను రంగంలోకి దించాలని ప్రభుత్వం యోచిస్తోంది. వీటిలో ఒకటైన కొవాగ్జిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ టీకా తొలి దశ ట్రయల్స్‌ ప్రాథమిక ఫలితాలు వెలువడ్డాయి. టీకా వాడకం ద్వారా వ్యాధి నిరోధకత లభించిందని, ఏ దుష్ప్రభావాలు చోటుచేసుకోలేదని వెల్లడైంది.