కరోనా వ్యాక్సిన్‌పై కానారాని స్పష్టత
ప్రయోగాలు సత్ఫలితం ఇస్తేనే మరింత ముందకు
తొలిరకం టీకాలతో సంపూర్ణ విజయం అసాధ్యం
యూకే టాస్క్‌ఫోర్స్ సంచలన వ్యాఖ్యలు
లండన్,అక్టోబర్28(జనంసాక్షి): కరోనా వ్యాక్సిన్ కోసం ప్రయోగాల దశలో చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయని అనుకుంటున్న సమయంలో సర్వత్రా దానిపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. అవి ఎంతవరకు పని చేస్తాయన్నది పరిశీలిస్తే తప్ప తెలియదని అంటున్నారు. అలాగే ఇప్పుడున్న కరోనాకు వ్యాక్సిన్ ఏ మేరకు పనిచేస్తాయో చూడాలంటున్నారు. యావత్తు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ను అంతమొందించేందుకు ఉన్న ఏకైక మార్గం ప్రస్తుతానికి వ్యాక్సిన్ మాత్రమేనని భావిస్తున్నారు. వీలైనంత త్వరగా టీకా అందుబాటులోకి రావాలని ప్రతిఒక్కరూ ఆశిస్తున్నారు. గతంలో మరే వ్యాధికీ ఇంత త్వరగా టీకా రావాలని ఆశించిన దాఖలాలు లేవని చరిత్ర చెబుతోంది. ఈ తరుణంలో వ్యాక్సిన్ అభివృద్ధి కోసం యునైటెడ్ కింగ్‌డమ్(యూకే)లో ఏర్పాటైన ప్రత్యేక కార్యదళం ఛైర్మన్ కేట్ బింగమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్‌ను అరికట్టేందుకు అభివృద్ధి చేస్తున్న తొలితరం టీకాలు అసంపూర్ణంగా ఉండే అవకాశం ఉందని వెల్లడించారు. అసలు కరోనాకు పూర్తిస్థాయి వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందో.. లేదో.. కూడా చెప్పలేమన్నారు. ప్రస్తుతం అభివృద్ధిలో ఉన్న టీకాలు పూర్తిగా కొవిడ్‌ను అరికట్టకపోయినా.. లక్షణాలు, వ్యాధి తీవ్రతను తగ్గిస్తాయని తెలిపారు. అలాగే అందరికీ.. ఎప్పటికీ.. వ్యాక్సిన్ పనిచేస్తుందని కూడా చెప్పలేమన్నారు. ఇలాంటి పరిస్థితులకు ప్రతిఒక్కరూ సన్నద్ధమై ఉండాల్సిందేనని వివరించారు. ఈ మేరకు ప్రముఖ మెడికల్ జర్నల్ లాన్సెట్‌లో వ్యాక్సిన్ కోసం తాము చేస్తున్న కృషిని వివరిస్తూ ఓ కథనం ప్రచురించారు. ప్రస్తుతం అభివృద్ధిలో ఉన్న దాదాపు అన్ని వ్యాక్సిన్లు విఫలమయ్యే అవకాశం ఉన్నట్లు గుర్తించామని బింగమ్ తెలపడం ఆందోళన కలిగించే అంశం. ఈ నేపథ్యంలో సమర్థమైన, సురక్షితమైన టీకాను అందించడమే లక్ష్యంగా తమ బృందం పనిచేస్తోందన్నారు. ఇందుకోసం అందుబాటులో ఉన్న అన్ని విధానాలను పరిగణనలోకి తీసుకుంటున్నామన్నారు. మరణాలు ఎక్కువగా 65 ఏళ్ల పైబడిన వారిలోనే ఉంటున్నాయని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో 65 ఏళ్ల పైబడిన వారిలో రోగనిరోధక శక్తిని పెంచే వ్యాక్సిన్ పైనే దృష్టి కేంద్రీకరించామన్నారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్
తయారీ సామర్థ్యం ఏమాత్రం సరిపోదని బింగమ్ తెలిపారు. వేసవికాలంలో బ్రిటిష్ ప్రజల్లో యాంటీబాడీలు అత్యంత వేగంగా క్షీణిస్తున్నట్లు గుర్తించామని ‘ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్’ తెలిపింది. ఈ నేపథ్యంలో కరోనా సోకిన తర్వాత ఏర్పడే రోగనిరోధక శక్తి ఎక్కువ కాలం ఉంటుందని ఆశించలేమని వెల్లడించింది.
మరోవైపు రెండో దశ కరోనా వైరస్ మరింత ప్రమాదకరంగా ఉండే అవకాశం ఉందన్న అంచనాలతో బ్రిటిష్ ప్రభుత్వం సన్నద్ధమవుతున్నట్లు టెలిగ్రాఫ్ పత్రిక వెల్లడించింది. ఐరోపా దేశాల్లో కరోనా కేసులు మరోసారి విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ దశలో ప్రయోగాలు మరింత లోతుగా చేయాల్సి ఉందన్న అభిప్రాయం వస్తోంది.