కరోనా వ్యాక్సిన్ తరువాత సీఏఏపై దృష్టి – అమిత్ షా
బోల్పూర్,డిసెంబరు 22 (జనంసాక్షి): కరోనా వ్యాప్తి కారణంగా పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అంశం కాస్త తెరమరుగయ్యిందని.. దేశంలో టీకా పంపిణీ మొదలు కాగానే ఆ విషయంపై దృష్టి పెడతామని కేంద్ర ¬ంమంత్రి అమిత్ షా ప్రకటించారు. పశ్చిమ బెంగాల్ పర్యటన సందర్భంగా భాజపా అధినేత జేపీ నడ్డా కాన్వాయ్‌పై ఇటీవల జరిగిన దాడిని ఆయన ఖండించారు. ఇందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వం బాధ్యత వహించాలని షా విరుచుకు పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి పశ్చిమ బెంగాల్ కేడర్‌కు చెందిన ముగ్గురు ఐపీఎస్ అధికారులను డిప్యూటేషన్‌పై పంపించాలని కోరుతూ కేంద్రం, తృణమూల్ ప్రభుత్వానికి లేఖ రాసింది. కాగా, ఈ చర్య రాజ్యాంగ విరుద్ధమని, ఆమోద యోగ్యం కాదని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు. ఈ నేపథ్యంలో తమకు రక్షణ కల్పించే బాధ్యత వారిపై ఉన్నందున.. సంబంధిత ఐపీఎస్ అధికారులను ఆదేశించే అధికారం కేంద్రానికి ఉందని ఆయన స్పష్టం చేశారు. వివరణ కోరుతూ రాష్ట్రానికి లేఖ రాయటం చట్టబద్ధమేనని.. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే ముందు నిబంధనల పుస్తకాలను ఓ సారి పరిశీలించాలంటూ ఆయన మమత ప్రభుత్వానికి హితవు పలికారు.పౌరసత్వ సవరణ చట్టానికి సంబంధించిన నియమాలను రూపొందించటం ఓ భారీ ప్రక్రియ అని అమిత్ షా తెలిపారు. ప్రస్తుతమున్న కొవిడ్ పరిస్థితిలో దానిని కొనసాగించలేమన్నారు. వ్యాక్సిన్ పంపిణీ ద్వారా కరోనా శృంఖలాన్ని ఛేదించిన వెంటనే తాము ఈ అంశంపై దృష్టి పెడతామని ఆయన వెల్లడించారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు మమత, ఆమె పార్టీయే ‘స్థానికులు- పరాయివారు’ అనే అంశాన్ని లేవనెత్తారని ఈ సందర్భంగా కేంద్ర ¬ంమంత్రి విమర్శించారు.