కర్ణాటకలో జోరుపెంచిన కాంగ్రెస్
` నోటిఫికేషన్‌కు ముందే జాబితా విడుదల
` 124 మంది అభ్యర్థులతో తొలి జాబితా
బెంగళూరు(జనంసాక్షి):కర్ణాటకలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. త్వరలో ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలున్నాయి. ప్రస్తుత అసెంబ్లీ పదవీకాలం మే 24న ముగియనుంది. నోటిఫికేషన్ వెలువడక ముందే.. ప్రధాన రాజకీయపార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకోవాలని అధికార పార్టీ బీజేపీ ప్రణాళికలు రచిస్తుంటే.. దానికి చెక్ పెట్టాలని కాంగ్రెస్.. ఆ రెండు పార్టీలకు షాకివ్వాలని జేడీఎస్ ప్రణాళికలను ముమ్మరం చేశాయి. ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేసిన కాంగ్రెస్.. తాజాగా.. కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ 124 మంది అభ్యర్థులతో శనివారం తొలి జాబితాను విడుదల చేసింది. ఇందులో మాజీ ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కూడా ఉన్నారు. మాజీ సీఎం సిద్ధరామయ్య వరుణ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతుండగా, శివకుమార్ కనకపుర నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు కాంగ్రెస్ పార్టీ వెల్లడిరచింది. దీంతో గడువుకన్నా ముందే ఎన్నికల పక్రియను ముగించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహాలను చేస్తోంది. దీంతో త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశముందని తెలుస్తోంది. 2018లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 224 స్థానాలకు గాను బీజేపీ 104 స్థానాలు గెలుచుకోగా, కాంగ్రెస్ 78 సీట్లు, జేడీఎస్ 37 సీట్లు కైవసం చేసుకున్నాయి. కర్ణాటక ప్రజ్ఞావంత జనతా పార్టీ, బహుజన్ సమాజ్ వాదీ పార్టీ చెరో సీటు దక్కించుకోగా.. ఒక ఇండిపెండెంట్ సైతం గొలుపొందారు. పార్టీ సీనియర్ నేత, మాజీ సీఎం సిద్ధ రామయ్య, పీసీసీ అధ్యక్షుడు డీకే కుమార్ ఉన్నారు. మరో ముఖ్య విషయమేమిటంటే సిద్ధ రామయ్య.. తన కుమారుడు యతీంద్ర స్థానమైన మైసూరులోని వరుణ నియోజకవర్గం నుంచి పోటీకి సిద్ధమయ్యారు. గతంలో సిద్ధ రామయ్య అదే స్థానం నుంచి పోటీ చేసి పలుమార్లు విజయం సాధించారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం తన కొడుకు యతీంద్ర కోసం ఆ స్థానాన్ని త్యాగం చేశారు. వరుణ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఈ సారి కోలార్ నుంచి కాకుండా వరుణ నుంచి పోటీ చేయాలని రాహుల్ గాంధీ సూచన మేరకు సిద్ధరామయ్య ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సిద్ధ రామయ్య వరుణ నుంచి పోటీ చేయనుండడంతో.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కొడుకు ఎక్కడ్నుంచి పోటీ చేస్తాడన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. తాజాగా పార్టీ ప్రకటించిన జాబితాలో అసలు ఆయన పేరు కూడా లేకపోవడంతో యతీంద్రకు ఎమ్మెల్యేగా కాకుండా ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశాలున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి.