కర్ణాటకలో బీజేపీకి షాక్‌


– ఉపఎన్నికల ఫలితాల్లో ఘోర పరాభవం
– మూడు లోక్‌సభ, రెండు అసెంబ్లీ స్థానాలకు ఫలితాలు విడుదల
– రెండు లోక్‌సభ, రెండు అసెంబ్లీ స్థానాల్లో జేడీఎస్‌ – కాంగ్రెస్‌ కూటమి విజయం
– శివమొగ్గ లోక్‌సభ స్థానాన్ని కైవసం చేసుకున్న బీజేపీ
– సంబురాలు చేసుకున్న జేడీఎస్‌ – కాంగ్రెస్‌ శ్రేణులు
బెంగళూరు, నవంబర్‌6(జ‌నంసాక్షి) : కర్ణాటక ఉపఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాభవం ఎదురైంది. కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమి వ్యూహం ముందు కాషాయపార్టీ కూలబడింది. మూడు లోక్‌సభ, రెండు శాసనసభ స్థానాలు సహా ఐదు స్థానాల్లో నాలుగు స్థానాల్లో కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమి విజయ ఢంకా మోగించింది. ఇక బీజేపీ కంచుకోట శివమొగ్గలో సైతం బీజేపీ పరిస్థితి చావు తప్పి కన్నులొట్టబోయినట్టు స్వల్ప మెజార్టీతో విజయం సాధించింది. రాష్ట్రంలోని మూడు లోక్‌సభ నియోజకవర్గాలు, రెండు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికలకు మంగళవారం కౌంటింగ్‌ కొనసాగింది. ఉదయం 8గంటలకు ప్రారంభమైన కౌంటింగ్‌ మధ్యాహ్నం 12గంటల వరకు పూర్తి వివరాలు వెలువడ్డాయి.
ఫలితాలు ఇలా..
– బళారిలో లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్ధి ఉగ్రప్ప విజయం సాధించారు. కాంగ్రెస్‌ అభ్యర్ధి ఉగ్రప్పకు 5,15,170 ఓట్లురాగా, ప్రత్యర్ధి పార్టీ బీజేపీ అభ్యర్ధి శాంతకు 3,16,872 ఓట్లు పోలయ్యాయి. కాగా 1,98,298 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్‌ అభ్యర్ధి ఉగ్రప్ప విజయం సాధించారు.
– శివమొగ్గ లోక్‌సభ స్థానంలో బీజేపీ అభ్యర్ధి రాఘవేంద్ర విజయం సాధించారు. బీజేపీ అభ్యర్ధి రాఘవేంద్రకు 5,30,137 ఓట్లు పోలవ్వగా, జేడీఎస్‌ అభ్యర్ధి మధుబంగారప్పకు 4,70,694 ఓట్లు పోలయ్యాయి. కాగా మధుబంగారప్పపై రాఘవేంద్ర 59,443 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
– మాండ్య లోక్‌సభ స్థానలో జేడీఎస్‌ అభ్యర్ధి శివకుమార్‌గౌడ విజయం సాధించారు. శివకుమార్‌ గౌడకు 5,01,782 ఓట్లు పోలవ్వగా, బీజేపీ అభ్యర్ధి సిద్ధరామయ్యకు 2,15,488 ఓట్లు పోలయ్యాయి. కాగా సిద్ధిరామయ్యపై జేడీఎస్‌ అభ్యర్ధి శివకుమార్‌గౌడ 2,86,294 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు.
– రామ్‌నగరం అసెంబ్లీ స్థానంలో జేడీఎస్‌ అభ్యర్ధి(సీఎం కుమారస్వామి సతీమణి) అనితా కుమారస్వామి విజయం సాధించారు. అనితా కుమారస్వామికి 1,22,070 ఓట్లు పోలవ్వగా, బీజేపీ అభ్యర్ధి చంద్రశేఖర్‌రావుకు 15,488 ఓట్లు పాలయ్యాయి. కాగా చంద్రశేఖర్‌పై అనితా కుమారస్వామి 1,06,582 ఓట్లు మెజార్టీతో గెలిపొందారు. ఇదిలా ఉంటే బీజేపీ నుంచి బరిలోకి దిగిన చంద్రశేఖర్‌ ఇటీవల బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. దీంతో అనిత కుమారస్వామి విజయం పోలింగ్‌ ముందే దాదాపు ఖరారైంది.
– జిమ్‌ఖండి అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్ధి ఆనంద్‌ సిద్ధు గెలుపొందారు. ఆనంద్‌సిద్ధుకు 96,008 ఓట్లు పోలవ్వగా, బీజేపీ అభ్యర్ధి కుల్‌కర్ణికి 57,488 మంది ఓట్లు పోలయ్యాయి. కాగా కుల్‌కర్ణిపై ఆనంద్‌ సిద్ధు 38,520 ఓట్లు మెజార్టీతో ఘన విజయం సాధించారు.
సంబరాలు చేసుకున్న కాంగ్రెస్‌, జేడీఎస్‌ శ్రేణులు..
తాజా ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్‌, జేడీఎస్‌ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. రోడ్లపైకి వచ్చి బాణాసంచాను పేల్చి, స్వీట్లు తినిపించుకున్నారు.  బీజేపీ ప్రతికూలవాద రాజకీయాలను ప్రజలు తిరస్కరించారనడానికి ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని కాంగ్రెస్‌ నేత దినేశ్‌ గుండూరావు వ్యాఖ్యానించారు. మరో తమకు భారీ విజయం కట్టబెట్టినందుకు కర్ణాటక ప్రజలకు మాజీ ప్రధాని, జేడీఎస్‌ చీప్‌ హెచ్‌డీ కుమారస్వామి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరీకరించేందుకు ప్రయత్నించేవారికి ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు అని ఆయన అన్నారు.
బళ్లారిలో సోనియా రికార్డ్‌ బ్రేక్‌ ….
కర్ణాటక ఉపఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీకి గట్టి షాక్‌ తగిలింది. ఈ ఎన్నికల్లో భాజపా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించిన బళ్లారి లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి ఉగ్రప్ప ఘన విజయం సాధించారు. తన సవిూప భాజపా అభ్యర్థి శాంతపై 1,98,298ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
బళ్లారిలో 2004 నుంచి భాజపానే గెలుస్తూ వస్తోంది. అంతేగాక గాలి జనార్దన్‌ రెడ్డి సోదరులకు మంచి పట్టున్న నియోజకవర్గం. గత 2014 లోక్‌సభ ఎన్నికల్లోనూ భాజపా నేత బి. శ్రీరాములు బళ్లారిలో విజయం సాధించారు. అయితే ఈ ఏడాది కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన శ్రీరాములు తన లోక్‌సభ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో ఇక్కడ ఎన్నిక అనివార్యమైంది. గత శనివారం బళ్లారిలో ఉపఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల్లో భాజపా నుంచి శ్రీరాములు సోదరి శాంత బరిలోకి దిగారు. మరోవైపు భాజపాపై ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్న కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమి శాంతకు వ్యతిరేకంగా బలైమన
అభ్యర్థిని పోటీలో నిలబట్టింది. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు అత్యంత సన్నిహితుడైన ఉగ్రప్పను కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలోకి దించింది. ఉగ్రప్పకు జేడీఎస్‌ పార్టీ మద్దతిచ్చింది. తాజాగా వెలువడిన ఫలితాల్లో తొలి రౌండ్‌ నుంచే ఆధిక్యం ప్రదర్శించిన ఉగ్రప్ప భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. ఇదిలా ఉండగా.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బళ్లారి నియోజకవర్గంలోని 8 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమి ఆరు చోట్ల గెలుపొందింది. ఇది కూడా తాజా ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కలిసొచ్చింది.
2004 ముందు వరకు కూడా ఇక్కడ కాంగ్రెస్‌ పార్టీనే అధికారంలో ఉంది. 1999లో కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ.. భాజపా నేత, ప్రస్తుతం కేంద్ర విదేశాంగ మంత్రిగా ఉన్న సుష్మాస్వరాజ్‌ బళ్లారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో సోనియా గాంధీ విజయం సాధించారు. ఆ తర్వాత 2004లో జరిగిన ఎన్నికల్లో భాజపా గెలుపొందింది. ఇక అప్పటి నుంచి వెనుదిరిగి చూడలేదు. ఏళ్ల పాటు ఇక్కడ గాలి సోదరులు, శ్రీరాములే గెలుస్తూ వస్తున్నారు. అయితే తాజా ఎన్నికల్లో కాంగ్రెస్‌-జేడీఎస్‌ చేతులు కలపడంతో భాజపాకు ఓటమి తప్పలేదు.