కర్ణాటక ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేసిన‌ రాహుల్ గాంధీ

మే 12 న జరగనున్న కర్ణాటక ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ తన మ్యానిఫెస్టోను విడుదల చేసింది. శుక్రవారం(ఏప్రిల్-27) ఉదయం మంగుళూరులో పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తమ మ్యానిఫెస్టోని విడుదల చేశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ… కర్ణాటక ప్రజల మనసులో మాట ఈ మ్యానిఫెస్టోలో ఉందని రాహుల్ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని రంగాలు, ప్రాంతాలు, కులాలకు, మతాలకు ఇది చేరుతుందన్నారు. రాష్ట్ర ప్రజల దగ్గరికి వెళ్ళి వారికి ఏం కావాలో అడిగి.. వాళ్లు కోరినవాటినే ఈ మ్యానిఫెస్టోలో పెట్టామని రాహుల్ తెలిపారు. మహిళల ఉపాధి అవకాశాలను 50 శాతం పెంచుతామని తెలిపారు. ప్రతి ఏటా 1000 మంది మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సహకారం అందజేస్తామని రాహుల్ తెలిపారు.
తమ ప్రత్యర్థులు కర్ణాటక సంస్క‌ృతిని గౌరవించరని పరోక్షంగా బిజేపీని విమర్శించారు రాహుల్. బీజేపీ మ్యానిఫెస్టోను కేవలం ముగ్గురు, నలుగురు మాత్రమే తయారు చేస్తారని, ఆ మ్యానిఫెస్టోలో అవినీతి ఉంటుందన్నారు. బీజేపీ మ్యానిఫెస్టో అంటే ఆరెస్సెస్ మేనిఫెస్టో అని రాహుల్ తెలిపారు.