కర్నాటకపై ప్రభావం చూపుతున్న కేరళ వరదలు

ఉధృతంగా ప్రవహిస్తున్న తుంగా,కావేరీలు

నీట మునిగిన శృంగేరీ

బెంగళూరు,ఆగస్ట్‌15(జ‌నం సాక్షి): కేరళను ముంచెత్తుతున్న భారీ వర్షాల ప్రభావం.. సరిహద్దు కర్ణాటక జిల్లాలపై పడింది. ఎడతెరిపిలేని వర్షాలకు దక్షిణ కన్నడ, ఉడుపి, కొడగు, మైసూరు, శివమొగ్గ, చిక్కమగళూరు జిల్లాల ప్రజలు అగచాట్ల పాలవుతున్నారు. ప్రధాన పట్టణాల నుంచి మారుమూల అనేక గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. పశ్చిమ కనుమల్లోని కొండదారుల్లో మట్టిదిబ్బలు విరిగి పడుతుండడంతో వాహన రాకపోకలకు అడ్డంకులు తప్పడం లేదు. వేలాది ఎకరాల్లో పంట పొలాల్లో నీరు చేరింది. ఈదురుగాలులకు పోక, అరటి, కాఫీ తోటలకు నష్టం వాటిల్లింది. ఉడుపి, దక్షిణ కన్నడ జిల్లాల్లో పూర్తిగా, చిక్కమగళూరు, కొడగు, శివమొగ్గ జిల్లాల్లో పలు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. చిక్కమగళూరు, హళరనాడు, కళస మార్గాల్లోని వంతెనలు నీట మునిగాయి. రాకపోకలు నిలిచిపోయాయి. తుంగ, భద్ర నదులు పొంగుతుండడంతో హెబ్బాళ, మహల్‌గూరు వంతెనలు నీట మునిగాయి. కావేరికి కూడా వరదపోటు వస్తోంది. దీంతో కావేరీ ఉధృతంగా ప్రవహిస్తోంది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని సముద్రతీరంలో హెచ్చరికలను జారీ చేశారు. కొడగు జిల్లా త్రివేణిసంగమం ఉన్న భాగమండల పూర్తిగా జలమయమైంది. మైసూరు శివార్లలో సుత్తూరు వంతెనను తీర ప్రాంత జిల్లాలు, కొడగు ప్రాంతంలో వరదల ప్రభావం తీవ్రంగా ఉంది. హారంగి జలాశయం నీటితో నిండడంతో మంగళవారం సాయంత్రం 45వేల క్యుసెక్కుల నీటిని విడిచి పెట్టారు. నదీ పరివాహక ప్రాంతాల్లో ఉంటున్న వారిని ఇప్పటికే ఖాళీ చేయించి, సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మడికేరి, సోమవారపేట, ఉడుపి, కార్కళ, శృంగేరి, బాళేహళన్నూరు, బజెగుండి, నాపోక్లు, బాళెలె, నిట్టూరు, శొంఠికొప్ప, బైందూరు తదితర ప్రాంతాల్లో కొండ చరియలు విరిగి పడుతుండడంతో వాటిని తొలగించే పనులను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. దక్షిణ కన్నడ, ఉడుపి, చిక్కమగళూరు, కొడగు, శివమొగ్గ జిల్లాల్లోని పలు గ్రామాలు ద్వీపాలను తలపిస్తున్నాయి. ఉడుపి, దక్షిణ కన్నడ జిల్లాల్లో వందకు పైగా ఇళ్లుకూలిపోయాయి. 50కు పైగా ఇళ్లు నీటమునిగిపోయాయి. వంతెనల పైనుంచి నీటి ప్రవాహం కొనసాగుతోంది. ప్రముఖ ధార్మిక క్షేత్రం శృంగేరి తడిసిముద్దయింది. వివిధ ప్రాంతాల నుంచి శారదాదేవి దర్శనం కోసం వచ్చిన భక్తులు భారీ వర్షాలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మఠానికి చెందిన భోజనశాలలోకి నీరు చేరింది. మొన్నటి వరకు నంజనగూడు సవిూపంలో కపిలా నది ప్రమాదస్థాయిని మించి ప్రవహించడం వల్ల నాలుగైదు రోజుల పాటు నీటిలోనే ఆలయాన్ని చేరుకోవాల్సిన పరిస్థితులు ఇప్పుడు శృంగేరిలో తలెత్తాయి. తుంగా నది ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తోంది. ఆలయానికి సవిూపంలోని గాంధీ మైదానం, పార్కింగ్‌ స్థలాలు పూర్తిగా నీట మునిగినట్లు భక్తులు తెలిపారు. ఎగువన భారీ వర్షాలు కురవడంతో తుంగా నది పరవళ్లు తొక్కుతోంది. ఉత్తర కన్నడ జిల్లా అంకోలా- యల్లాపుర రహదారిలోని అరబైలు ఘాట్‌ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. విరిగిపడ్డ కొండచరియల్ని తొలగించే పక్రియను యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు.