కర్షకులపై కర్కశం..
– రైతుల డిమాండ్లు ఒప్పుకోని సర్కారు
– కొనసాగుతున్న ఆందోళనలు
న్యూఢిల్లీ,డిసెంబరు 1(జనంసాక్షి): కేంద్రం తీసుకు వచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని కోరుతూ ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతు సంఘాల నేతలతో కేంద్ర ప్రభుత్వం మంగళవారం చర్చలు జరిపింది. ముగ్గురు కేంద్ర మంత్రులతో కూడిన బృందం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. మూడు వ్యవసాయ చట్టాలపై చర్చించేందుకు ఒక కమిటీని వేద్దామని కేంద్ర మంత్రులు ప్రతిపాదించగా రైతు సంఘాల నేతలు ఏకపక్షంగా తిరస్కరించారు. ఈ కమిటీలో కేంద్ర ప్రభుత్వ అధికారులు, వ్యవసాయరంగ నిపుణులు ఉంటారని, రైతు సంఘాల నుంచి ఎవరు ప్రతినిధులుగా ఉంటారో పేర్లు ఇవ్వాలని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి తోమర్ కోరగా రైతు సంఘాల నేతలు తిరస్కరించారు. ఈ దశలో తాము కమిటీకి ఒప్పుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తామని స్పష్టమైన హావిూ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతకముందు ఎటువంటి షరతులు లేకుండా కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించడంతో చర్చలకు వెళ్లాలని రైతు సంఘాల నాయకులు నిర్ణయించుకున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో 35 మంది రైతు సంఘాల నాయకుల బృందంతో ముగ్గురు కేంద్ర మంత్రులు చర్చలు జరిపారు. అయితే చర్చల్లో ఏ విషయం తేలకపోవడంతో గురువారం మళ్లీ చర్చించాలని నిర్ణయించకున్నారు. పంజాబ్, ఉత్తరఖండ్, ఉత్తరప్రదేశ్, హరియాణ రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్ర మంత్రులు తోమర్, పియూష్ గోయల్, సోమ్ ప్రకాశ్ చర్చలు జరిపారు. తమ డిమాండ్లు తీరే వరకు వెనక్కి తగ్గేది లేదని, పంజాబ్, హరియాణ నుంచి రైతులు ఇంకా వస్తున్నారని, ఏడాది పాటైనా బైఠాయించేందుకు సిద్దపడి వచ్చామని రైతు సంఘాల నేతలు చెప్పారు.